Bhavitha
Bhavitha Mandava: మన హైదరాబాద్ నుంచి న్యూయార్క్ వెళ్లిన ఓ అమ్మాయి మోడలింగ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. న్యూయార్క్ సిటీలో జరిగిన షనెల్ మెతీర్స్ దార్-2026 కలెక్షన్‌లో ర్యాంప్‌ను ఓపెన్ చేసి ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త స్టార్‌గా నిలిచింది. ర్యాంప్‌ను ఓపెన్ చేయడం అంటే.. షోను ప్రారంభించే స్టార్ మోడల్‌గా అందరు మోడళ్ల కంటే ముందుగా వాక్ చేయడం.
ఆ తెలుగు అమ్మాయి పేరు భవిత మందవ (25). గ్లోబల్ రన్‌వేలపై అద్భుత విజయాలు సాధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే పెద్ద ఫ్యాషన్ షోల్లో సత్తా చాటుతోంది. అంతర్జాతీయ స్థాయిలో మోడల్స్ నడిచే ర్యాంప్‌లలో ప్రత్యేకంగా నిలుస్తోంది.
షనెల్ మెతీర్స్ దార్-2026 కలెక్షన్ షోలో మొదటి లుక్ ఆమెదే. ఇలా ఓ ఛానెల్ షోను ఓపెన్ చేసిన మొట్టమొదటి భారత మోడల్‌గా ఆమె నిలిచింది. ఆమెకు ఆ బ్రాండ్ ఇంతగా ప్రాధాన్యం ఇచ్చింది. బ్రాండ్ నమ్మకాన్ని అంతగా పొందింది భవిత. దీన్ని ఫ్యాషన్ ప్రపంచంలో గొప్ప గౌరవంగా భావిస్తారు. మహిళా ఫ్యాషన్‌లో స్వేచ్ఛ, సరళత, శాశ్వతమైన స్టైల్‌ను తీసుకువచ్చిన బ్రాండ్ షనెల్.
ఎవరు ఈ భవిత?
భవిత భారత్‌లో ఆర్కిటెక్చర్ చదివింది. తర్వాత న్యూయార్క్ యూనివర్సిటీలో అసిస్టివ్ టెక్నాలజీ చదవడానికి యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లింది. చదువుతో పాటు ఫ్యాషన్‌పై ఆసక్తి పెంచుకుంది.
మోడల్స్ డాట్ కామ్ తెలిపిన వివరాల ప్రకారం.. స్ప్రింగ్/సమ్మర్ 2025 సీజన్‌కు రెండు వారాల ముందు ఓ సబ్‌వే స్టేషన్‌లో భవిత మందవ టాలెంట్‌ను మొదటగా గుర్తించింది ఒక స్కౌటింగ్ టీమ్. సబ్‌వేలో ఆమెను చూసి ఎంపిక చేసింది. మొదటిసారి ఆమెను కాస్ట్ చేసిన డిజైనర్ పేరు మాథ్యూ బ్లేజీ.
ఆయన ఫ్రెంచ్ ఫ్యాషన్ డిజైనర్, లగ్జరీ బ్రాండ్‌లలో క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తి. మాథ్యూ బ్లేజీ అప్పట్లో “బొటేగా వెనెటా” అనే ఫ్రెంచ్-ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్‌లో క్రియేటివ్ డైరెక్టర్/డిజైనర్ గా పనిచేస్తున్నారు. అప్పుడు బ్లేజీ ఆ బ్రాండ్ కోసం డిజైన్‌లు రూపొందించే బాధ్యతలో ఉన్నారు.
భవిత రన్‌వే అరంగేట్రం ప్రీమియం ఫ్యాషన్ బ్రాండ్ “బొటేగా వెనెటా”లో ఎక్స్‌క్లూజివ్‌గా జరిగింది. ఆ బ్రాండ్‌తో క్యాంపెయిన్ కూడా చేసింది. బ్లేజీ మార్గదర్శనం ఆమెకు ఎంతగానో ఉపయోగపడింది.
స్ప్రింగ్ 2026 కోసం మాథ్యూ రూపొందించిన తొలి షనెల్ కలెక్షన్‌లో ఆమె నడిచింది. న్యూయార్క్ సిటీ ట్రైన్ స్టేషన్‌లో జరిగిన రెండో మెతీర్స్ దార్ షోలో ఆమె ర్యాంప్‌ను ఓపెన్ చేసింది. ఫ్యాషన్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.
తల్లిదండ్రుల స్పందన వైరల్
డిసెంబర్ 3న భవిత షోను టీవీలో చూసిన ఆమె తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియోను భవిత పోస్ట్ చేసింది. ఆ క్లిప్‌లో ఆమె బోవరీ స్టేషన్ మెట్లపై దిగుతూ ర్యాంప్‌పైకి అడుగుపెడుతున్నట్లు ఉంది. ఆమె తల్లిదండ్రులు ఆ సమయంలో ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఆమె తల్లి కన్నీళ్లతో “మన భవిత” అని పలికింది.