BRSLP: బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ ఎవరు? ఏం జరుగుతోంది?

ఇలా పదవులన్నీ కేసీఆర్ కుటుంబ సభ్యులకే ఇస్తే పార్టీ వర్గాలతో పాటు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే చర్చ సైతం జరుగుతోంది.

BRSLP: బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ ఎవరు? ఏం జరుగుతోంది?

Updated On : May 1, 2025 / 8:40 PM IST

గులాబీ పార్టీలో పదవుల పందేరం మొదలైందా? అసెంబ్లీ, కౌన్సిల్ లో పదవుల కోసం ఆ ముగ్గురు పోటీ పడుతున్నారా? ఇంతకీ పార్టీ అధినేత కేసీఆర్ ఆ ముగ్గురిలో ఎవరివైపు మొగ్గుచూపుతారు? బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడిదే ఆసక్తి రేపుతున్న అంశం. అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ లీడర్ పదవిని కేటీఆర్, హరీష్ రావు ఆశిస్తుండగా.. మండలిలో ఫ్లోర్ లీడర్ పదవిపై కవిత ఆశలు పెట్టుకున్నారట. దీంతో కేసీఆర్ ఆ ముగ్గురిలో ఎవరికి పదవులు కట్టబెట్టబోతున్నారన్న ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రతిపక్షానికే పరిమితమైన బీఆర్ఎస్ ఇప్పుడు పదవుల పంపకాల్లో ఆచి తూచి అడుగులువేస్తోంది. BRS LP నేతగా, ప్రతిపక్ష నాయకుడిగా పార్టీ అధినేత అయిన కేసీఆర్ ఉన్నారు. అయితే ఎన్నికలు జరిగి సుమారు ఏడాదిన్నర దాటినా ఇప్పటి వరకు అసెంబ్లీలో BRS LP డిప్యూటీ లీడర్ ను మాత్రం నియమించలేదు.

ఎప్పటికప్పుడు శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎంపికను వాయిదా వేస్తూ వస్తున్నారు గులాబీ బాస్ కేసీఆర్. దీంతో అసెంబ్లీ సమావేశాల్లో ఆయా అంశాలను బట్టి సాధ్యమైనంత వరకు కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతూ వస్తున్నారు. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ముగిసిన నేపథ్యంలో మరోసారి BRS LP డిప్యూటీ లీడర్ పదవిపై పార్టీ ఎమ్మెల్యేల్లో చర్చ మొదలైంది.

అసెంబ్లీలో ప్రతిపక్షానికి ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ రీడర్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవులు ఉంటాయి. ఇప్పటికే అసెంబ్లీలో BRS LP నాయకుడిగా కేసీఆర్ ఉన్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసవెళ్లిన అరికెపూడి గాంధీకి ఇచ్చారు. దీంతో ఇప్పుడు మిగిలిన BRS LP డిప్యూటీ లీడర్ పదవి ఎవరికిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.

ఇద్దరిని నియమించాలని కేసీఆర్ నిర్ణయం?
అసెంబ్లీకి కేసీఆర్ రెగ్యులర్ గా రావడంలేదు కాబట్టి ఆయన లేనప్పుడు ఆ బాధ్యతలను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తీసుకుంటారు. అప్పుడు బీఆర్ఎస్ తరపున అసెంబ్లీలో మాట్లాడేందుకు ఎక్కువ సమయం లభిస్తుంది. అసెంబ్లీలో రెండు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోస్టులను నియమించుకునే అవకాశం ఉండటంతో పార్టీ తరపున ఇద్దరు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ రెండు పదవులు ఎవరికి దక్కుతాయన్న చర్చ గులాబీ పార్టీలో జరుగుతోంది.

పార్టీలో అధినేత కేసీఆర్ తరువాత నెంబర్-2గా ఉన్న ఇద్దరు నేతలు కేటీఆర్, హరీశ్ రావులో ఒకరికి అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి దక్కవచ్చని తెలుస్తోంది. ఐతే రెండు డిప్యూటీ లీడర్ పదవుల్లో ఒకటి కేటీఆర్ మరొకటి హరీష్ రావుకు ఇవ్వొచ్చన్న చర్చ సైతం జరుగుతోంది.

అలా చేస్తే అసెంబ్లీలో పదవులన్నీ కేసీఆర్ కుటుంబానికే అన్న విమర్శలు వెల్లువెత్తుతాయన్న ఆలోచనలో గులాబీ బాస్ కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కేటీఆర్, హరీశ్ లో ఎవరో ఒక్కరికి మాత్రమే డిప్యూటీ లీడర్ పదవి ఇచ్చి, మరో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవిని సీనియర్ ఎమ్మెల్యేకు కట్టబెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. కేటీఆర్ ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి..BRS LP డిప్యుటీ ఫ్లోర్ లీడర్ గా హరీష్ రావును నియమించే ఛాన్స్ ఉందంటున్నారు.

అయితే మరో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కోసం సీనియర్ నేతలైన సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితర పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక శాసన మండలిలో ప్రస్తుతం BRS ఫ్లోర్ లీడర్ గా మధుసూధనా చారి కొనసాగుతున్నారు. అయితే మండలిలో BRS ఫ్లోర్ లీడర్ పదవిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆశిస్తున్నారని తెలుస్తోంది.

ఈ మేరకు తనకు కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వాలని కవిత పార్టీ అధినేత కేసీఆర్ ను కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మధుసూదనా చారిని తప్పించి కవితకు మండలి ఫ్లోర్ లీడర్ పదవిని ఎలా కట్టబెడతారన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఇలా పదవులన్నీ కేసీఆర్ కుటుంబ సభ్యులకే ఇస్తే పార్టీ వర్గాలతో పాటు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే చర్చ సైతం జరుగుతోంది. ఇలాంటి సమయంలో గులాబీ బాస్ కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై పార్టీవర్గాల్లో ఉత్కంఠను రేపుతోంది.