వారసులకే మేయర్ పీఠం..? రేసులో కవిత, విజయశాంతి, శ్రీదేవి

who will become ghmc mayor: బల్దియా పీఠం అధిరోహించేది ఎవరు? ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న వంటి ప్రశ్న ఇదే. ఫిబ్రవరి 13న ఉదయం 11గంటలకు నూతన కార్పొరేటర్లతో ప్రమాణస్వీకారం నిర్వహించ తలపెట్టింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. అదే రోజు జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక జరుగుతుంది. జీహెచ్ఎంసీకి 2020 డిసెంబర్ 1 ఎన్నికలు జరగ్గా 4న ఫలితాలు వచ్చాయి. ఆ వెంటనే నూతన కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం ఉంటుందని అంతా ఆశించారు. ఏ పార్టీకి కూడా సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఎవరిని వరిస్తాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

టీఆర్ఎస్ అభ్యర్థి పేరు ప్రకటించ లేదు. కానీ, సీల్డ్ కవర్ లో అభ్యర్థి పేరు ఉంటుందని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చెప్పారు. జీహెచ్ఎంసీ మేయర్ అభ్యర్థి పేరు ఎన్నిక వరకు సీల్డ్ కవర్ లో ఉంటుందని, ఆ రోజున బయటకు వస్తుందని తెలిపారు. దీంతో టీఆర్ఎస్ వ్యూహంపై కొంతకాలం వరకు ఉన్న సస్పెన్స్ కు తెరపడింది. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు అనే అంశం ఉత్కంఠ రేపుతోంది. మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లు సీల్డ్ కవర్ ద్వారా కార్పొరేటర్లకు అందిస్తామని, కార్పొరేటర్లు వాటిని జీహెచ్ఎంసీలోనే తెరిచి పార్టీ బలపరిచిన అభ్యర్థికే ఓటు వేయాలని గులాబీ బాస్ సూచించారు.

కాగా, వారసులకే మేయర్ పీఠం దక్కే అవకాశం ఉంటుందని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. మేయర్ అభ్యర్థి విషయంలో బీసీ, రెడ్డి సామాజికవర్గాల మధ్య పోటీ ఉండే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీసీ కేటగిరిలో టీఆర్ఎస్ సీనియర్ నేత కేకే కూతురు విజయలక్ష్మి పేరు ముందు వరుసలో ఉంది. ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి కూడా రేసులో ఉన్నారు. రెడ్డి సామాజికవర్గం విషయంలో చూస్తే పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి, మన్నె గోవర్థన్ రెడ్డి సతీమణి కవిత, మాజీ ఎమ్మెల్యే కనకా రెడ్డి కోడలు విజయశాంతి ఆశలు పెట్టుకున్నారు. సీల్డ్ కవర్ లో అభ్యర్థి పేరు రానుండటంతో బల్దియా మేయర్ ఎవరనే విషయం గురువారం(ఫిబ్రవరి 11) రోజే తేలబోతోంది.

ట్రెండింగ్ వార్తలు