బండి సంజయ్, పొన్నం ప్రభాకర్‌ మధ్య పొలిటికల్‌ వార్‌

కాంగ్రెస్‌-బీజేపీ మధ్య పెద్ద వివాదమే చెలరేగుతుండగా.. రెండు జాతీయ పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో బీఆర్‌ఎస్‌కు స్కోప్‌ లేకుండా పోతోంది.

Bandi Sanjay vs Ponnam Prabhakar: కరీంనగర్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్‌లో పొలిటికల్‌ వార్‌ రోజురోజుకు ముదురుతోంది. సవాల్‌కు ప్రతి సవాల్‌ అంటూ మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ ఎంపీ సవాల్‌ చేస్తుంటే.. రాముడి విషయంలో తప్పు మాట్లాడితే సజీవ దహనం చేసుకుంటానంటూ ఫైర్‌ అయ్యారు మంత్రి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌-బీజేపీ మధ్య పెద్ద వివాదమే చెలరేగుతుండగా.. సదరు ఎంపీ తన మాటలను సమర్థించుకోవడం వివాదాస్పదంగా మారింది.

ఉద్రిక్తతల నడుమ ప్రజాహిత యాత్ర
రెండోసారి కరీంనగర్‌ ఎంపీగా గెలుపొందాలన్న లక్ష్యంతో ప్రజాహిత యాత్ర ప్రారంభించారు బండి సంజయ్‌. ఫస్ట్‌ ఫేజ్‌ యాత్ర ప్రశాంతంగా సాగినా.. రెండో విడత మాత్రం ఉద్రిక్తతల మధ్య నడుస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్‌ టార్గెట్‌గా బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలతో.. ఈ యాత్రకు అక్కడక్కడా కాంగ్రెస్‌ నాయకుల నిరసనల సెగ తగులుతూనే ఉంది.

బండి సంజయ్‌ వ్యాఖ్యలపై సీరియస్‌
సిద్దిపేట జిల్లా కోహెడలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ టార్గెట్‌గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎంపీ బండి సంజయ్‌. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్‌ శ్రేణులు వరుసగా రెండు రోజులు ఆయన యాత్రకు అడ్డంకులు సృష్టించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే స్పందించిన పొన్నం.. బండి సంజయ్‌ వ్యాఖ్యలపై సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యారు. రాముడి పుట్టుక గురించి తానెప్పుడూ మాట్లాడలేదని.. అలా మాట్లాడి ఉంటే సజీవ దహనానికి సిద్ధమన్నారాయన. ఈ విషయంలో తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు పొన్నం.

ప్రశ్నించడం తప్పా?
తన యాత్రను అడ్డుకున్న వారిని హెచ్చరించానే తప్ప.. ఎవరి తల్లి గురించి కించపర్చే వ్యాఖ్యలు చేయలేదని ప్రకటించారు బండి సంజయ్‌. అవసరమైతే పొన్నం ప్రభాకర్‌ తల్లి కాళ్లు మొక్కుతానని ప్రకటించారు. అయితే.. శుక్రవారం ఎల్కతుర్తిలో జరిగిన యాత్రలో మాత్రం తన మాటలను సమర్థించుకున్నారు బండి సంజయ్‌. రాముడు ఎక్కడ పుట్టాడో తెలియదన్న వారికి.. తమ తల్లి ఎవరో తెలుసా అని ప్రశ్నించడం తప్పా అన్నారాయన.

Also Read: ప్రాజెక్టుల చుట్టూ తెలంగాణ పాలిటిక్స్ .. మేడిగడ్డకు బీఆర్‌ఎస్‌, పాలమూరుకు కాంగ్రెస్

బీఆర్‌ఎస్‌కు స్కోప్‌ లేదా?
ఇప్పటికే బండి సంజయ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజాహిత యాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి బండి సంజయ్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాశంగా మారింది. అయితే.. రెండు జాతీయ పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో బీఆర్‌ఎస్‌కు స్కోప్‌ లేకుండా పోతోంది. ఇప్పటికే రాష్ట్రంలో గులాబీ పార్టీది మూడో స్థానం అంటున్న రెండు పార్టీలు.. మొదటి స్థానం కోసమే మా ఫైట్‌ అంటూ బాహాటంగానే ప్రకటిస్తున్నాయి. మొత్తంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎంపీ బండి సంజయ్‌ మధ్య జరుగుతున్న పొలిటికల్‌ వార్‌లో ఇంకా ఎన్ని సవాళ్లు, ప్రతి సవాళ్లు బయటకు వస్తాయో వేచి చూడాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు