Bandi Sanjay Comments KCR
Bandi Sanjay Comments KCR : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో శివాజీ విగ్రహాన్ని అవమానపర్చడం తప్పా, కాదా ఎంపీ బండి సంజయ్ అన్నారు. దాన్ని అడ్డుకోవఢం తప్పా అని ప్రశ్నించారు. అక్కడి కౌన్సిలర్ వచ్చి కార్యకర్తలను బెదిరించింది నిజం కాదా అని పేర్కొన్నారు. శివాజీ విగ్రహం ముందు మందు బాటిల్ పట్టుకుని మూత్రం పోస్తే తప్పు కాదా అని నిలదీశారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు.
సోడా బాటిల్స్, కత్తులతో దాడి చేస్తే తప్పు కాదా అని పేర్కొన్నారు. అందులో 30 మందిని అరెస్టు చేసి తెల్లవారే విడుదల చేశారని వెల్లడించారు. కానీ, హిందూ సంఘాలు ర్యాలీ తీస్తే మాత్రం తప్పైందా అని ప్రశ్నించారు. 11 మంది కార్యకర్తలు, సామాన్యులను మాత్రం ఎలా రిమాండ్ చేశారని అడిగారు.
నిజమైన హిందువని చెప్పుకునే ముఖ్యమంత్రి ఎందుకు గజ్వేల్ ఘటనపై స్పందించడంలేదు..? పైగా నిరసన తెలిపితే అరెస్టు చేస్తారా అని మండిపడ్డారు. దేశభక్తుల విగ్రహాలను అవమానపరిస్తే నిరసనలు తప్పవని హెచ్చరించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్పందించాలని, సమస్యను సద్దుమణిగేలా చూడాలన్నారు.
ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ముకాస్తోందని విమర్శించారు. అభివృద్ధిలో భాగంగానే శనివారం హన్మకొండలో మోదీ సభ ఉండబోతుందన్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్ హెచ్ 563 దాదాపు 30 గ్రామాలను కలుపుతూ 5 బైపాస్ రోడ్లతో ప్రారంభించబోవటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు.
8 ఏళ్ళుగా కొందరు నాయకులు గొప్పగా తామే చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కరీంనగర్ ఆర్వోబీ విషయంలో రాష్ట్రం తన వాటా ఇవ్వలేదని విమర్శించారు. 2,146 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చింది తామేనని స్పష్టం చేశారు.