John Wesley
కమ్యూనిస్టు పార్టీ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పోరాటాలు. బడుగు బలహీన వర్గాలకు అండగా ఎన్ని పోరాటాలు చేసినా..ఆ పార్టీల్లో పైస్థాయి క్యాడర్‌లో ఉన్నత వర్గానికి చెందినవారే ఆధిపత్యం చలాయిస్తారనేది జగమేరిగిన సత్యం. పైకి ఎన్ని చెప్పినా..లోపల వారి మాటే శాసనం అన్నది ఓపెన్ సీక్రెట్.
అయితే ఈ విమర్శలన్నింటికీ చెక్ పెడుతూ..కొత్త రాష్ట్ర కార్యదర్శిగా ఓ బడుగు వర్గానికి చెందిన జాన్ వెస్లీని ఎన్నుకోవడం చర్చనీయాంశంగా మారింది. లెఫ్ట్ పార్టీల్లో ఎప్పుడూ అగ్రవర్గాల నేతలదే పెత్తనం ఉంటుందనే చర్చ ఉంది. అందుకు భిన్నంగా ఈ సారి దళిత నేతకు రాష్ట్ర పగ్గాలు అప్పగించారు. పోటారాలు చేసేది బడుగు బలహీన వర్గాలకు చెందినవారైతే..పార్టీ కీలక పదవుల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి ఆధిపత్యం నడుస్తుందనే విమర్శలున్నాయి.
సీపీఎం, సీపీఐ రెండు లెఫ్ట్ పార్టీలలో అగ్రవర్ణాలకు చెందిన అందులో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే పార్టీ కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. ఉమ్మడి ఏపీలోనూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు తప్ప మరొకరు సీపీఐ, సీపీఎం కార్యదర్శిగా ఎన్నిక కాలేదు. సీపీఎం పార్టీకి ఉమ్మడి రాష్ట్రంలో బీవీ రాఘవులు..సీపీఐకి నారాయణ అంతకు ముందు కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే పార్టీ కీలక పదవుల్లో కొనసాగారు.
TDP: జగన్ ఇలాకాలో పసుపు పార్టీ సంబరం.. ఆ నాలుగు జిల్లాలపై టీడీపీ స్పెషల్ ఫోకస్
ఈ నేతలు పార్టీ పగ్గాల కోసం శతవిధాలా ప్రయత్నాలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీపీఎం, సీపీఐ పార్టీలు కూడా ఆయా రాష్ట్రాలకు కొత్త కార్యదర్శులను నియమించుకున్నాయి. తెలంగాణ వచ్చినప్పటి నుంచి మొన్నటివరకు తమ్మినేని వీరభద్రమే సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు. ఈ సారి సీపీఎం కార్యదర్శి రేసులో ఖమ్మం, నల్గొండ జిల్లాల నేతలు పార్టీ పగ్గాల కోసం శతవిధాలా ప్రయత్నించారు. కానీ అనూహ్యంగా వేరే పార్టీ నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగిన జాన్ వెస్లీని కార్యదర్శిగా ఎన్నుకున్నారు. సీపీఎంలో ఖమ్మం జిల్లా నేతల డామినేషన్ ఏళ్ళ తరుబడిగా కొనసాగుతోందనే విమర్శలు ఉన్నాయి. పార్టీ అంతర్గత సమావేశాల్లో కూడా ఈ అంశంపై పెద్ద చర్చే జరిగిందట.
లోలోపల ఎన్ని జరిగినా.. పైకి మాత్రం తామంతా ఒక్కటే అన్నట్లుగా ఉండే వారు. అయితే ఈ సారి కూడా అయితే కమ్మ లేకపోతే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు కార్యదర్శి పదవి దక్కుతుందని అందరూ భావించారు. మహాసభల్లోనూ ఒక రోజు పార్టీలో సామాజిక వర్గాల ప్రాధాన్యతపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం.
తెర వెనుక ఓ శక్తి?
ఈసారి కచ్చితంగా తమకు ప్రాధాన్యత ఇవ్వాలని ఖమ్మం జిల్లా నేతలు పట్టుబట్టినా..తెర వెనుక ఓ శక్తి.. వారి ఆశలను పటాపంచలు చేసిందట. అనూహ్యంగా దళిత సామాజిక వర్గానికి చెందిన జాన్ వెస్లీ పేరును తెరపైకి తెచ్చారట. కిందిస్థాయి క్యాడర్ కూడా వెస్లీ వైపే మొగ్గు చూపడంతో.. గత్యంతరం లేక కార్యదర్శి రేసులో ఉన్న మిగతా నేతలు కూడా..ఆ దళిత నేత కార్యదర్శి అయ్యేందుకు ఏకగ్రీవ తీర్మానానికి ఓకే చెప్పారట.
కమ్యూనిస్టు పార్టీలో ఒక వర్గం ఆధిపత్యమే కొనసాగుతోందన్న విమర్శలకు చెక్ పెట్టేలా..కొత్త కార్యదర్శి నియామకం జరిగిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే బడుగు నేతకు పార్టీ పగ్గాలు దక్కడానికి ఓ కీలక నేతే కారణమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో కొత్త కార్యదర్శి స్వతంత్రంగా పనిచేస్తారా లేక సదరు నేత చేతిలో కీలుబొమ్మ అవుతారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడొచ్చిన రథసారధి పార్టీ భవిష్యత్‌కు బంగారు బాటలు వేయగలరా లేదా అనేది చూడాలి మరి.