KCR : మహేందర్‌రెడ్డిని అందలం ఎక్కించింది అందుకేనా.. ఎన్నికల వేళ కేసీఆర్ కీలక ఎత్తుగడ!

మహేందర్‌రెడ్డిని మంత్రి చేస్తానని చెప్పి.. కేవలం రెండు రోజుల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఎన్నికల ముందు మంత్రి వర్గ విస్తరణేంటి?

why patnam mahender reddy include in kcr cabinet explained in telugu

Mahender Reddy – KCR : మంత్రి పదవులు ఇవ్వడం.. మంత్రులను తొలగించడం పూర్తిగా ముఖ్యమంత్రి విచక్షణాధికారం. ఎవరిని ఎప్పుడు ఉంచాలో.. ఎవరిని తప్పించాలో సీఎం ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. కానీ, మంత్రులుగా తీసుకున్నవారికి ఎంతో ప్రాధాన్యం ఉంటేకాని ఆ పదవి దక్కదు. సాధారణంగా ఎన్నికలు అయ్యాక.. రకరకాల విశ్లేషణలు, సామాజిక సమీకరణాలు.. ఇలా ఎన్నో లెక్కలేసుకుని గెలిచిన వారిలో కొందరిని మంత్రులుగా తీసుకుంటారు సీఎం. తెలంగాణలో మంత్రిగా తాజాగా ప్రమాణస్వీకారం చేసిన పట్నం మహేందర్‌రెడ్డి (Patnam Mahender Reddy) విషయంలో ఈ లెక్కలన్నీ పూర్తిగా డిఫరెంట్. గత ఎన్నికల్లో ఓడిపోయిన మహేందర్‌రెడ్డి.. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (Telangana Elections 2023) జరగనున్నాయనగా.. మంత్రిగా నియమితులు కావడం ప్రత్యేకంగా చెప్పొచ్చు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలా ఎన్నికల ముందు.. అదీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మంత్రి వర్గ విస్తరణ (Cabinet Expansion) జరిగిన దాఖలాలు లేవు. ఒకే ఒక్క నేత కోసం మంత్రి వర్గాన్ని విస్తరించాల్సి రావడం వెనుక కారణమేంటి? మహేందర్‌రెడ్డికి పదవి కట్టబెట్టడం ద్వారా గులాబీ పార్టీకి లాభమేంటి?… మహేందర్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకోవడంలో సీఎం కేసీఆర్ (CM KCR) వ్యూహమేంటో?

తెలంగాణ ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయమే ఉంది. షెడ్యూల్ విడుదలకు ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తోంది. మరోవైపు పార్టీలు అభ్యర్థుల ఖరారుకు కుస్తీ పడుతున్నాయి. అధికార బీఆర్ఎస్ (BRS Party) అందరికన్నా వంద అడుగులు ముందుగా 115 నియోజవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక మరో నాలుగు నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేయాల్సివుంది. పార్టీ యంత్రాంగం అంతా ఎన్నికలపైనే దృష్టిపెట్టింది. సామాన్య కార్యకర్త నుంచి పార్టీలో అగ్రనేతల వరకు అంతా వచ్చే ఎన్నికల్లో గెలుపు.. ఆ తర్వాత వచ్చే పదవులపైనే ఫోకస్ పెట్టారు. కానీ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి మాత్రం అనూహ్యంగా అదృష్టం తలుపు తట్టింది.

ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉండగా, సీఎం కేసీఆర్ మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు మహేందర్‌రెడ్డి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ తొలి మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న మహేందర్‌రెడ్డి.. గత ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. కానీ, ఆయన సీనియార్టీని గుర్తించి ఎమ్మెల్సీని చేసింది బీఆర్ఎస్. ఐతే త్వరలో జరగబోయే ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం తాండూరు నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నారు మహేందర్‌రెడ్డి. ఆరు నూరైన పోటీ చేస్తానని ప్రకటించారు కూడా.. బీఆర్ఎస్ టిక్కట్ దక్కకపోతే గోడ దూకేస్తారనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని మహేందర్‌రెడ్డి ఎప్పుడూ ఖండించలేదు సరికదా.. పార్టీపై బహిరంగంగా ఎలాంటి విమర్శలు కూడా చేయకపోవడంతో రంగారెడ్డి రాజకీయం ఇంట్రస్టింగ్‌గా మారింది.

Also Read: చంద్ర మండలంకూడా ఖతమే.. కేసీఆర్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు మహేందర్‌రెడ్డి. రాజకీయంగా ఆయన కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. మహేందర్‌రెడ్డి భార్య సునీత వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన సోదరుడు నరేందర్‌రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరోవైపు సోదరుని కుమారుడు పట్నం అవినాశ్ రెడ్డి కూడా షాబాద్ జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్నారు. ఇలా కుటుంబంలో చాలా మందికి పదవులున్నా మహేందర్ రెడ్డికి సైతం మరోసారి కేబినెట్ లో చోటు దక్కడం ఆసక్తికరంగా మారింది. ఇక ఆయన సొంత మేనత్త సబితా ఇంద్రారెడ్డి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు. ఇక ప్రజల్లోనూ.. బీఆర్ఎస్‌తోపాటు ప్రత్యర్థి పార్టీల్లోనూ మహేందర్‌రెడ్డి బలం, బలగం ఎక్కువే.. ఐనప్పటికీ తాండూరు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఒక్కసారి ఎన్నికల్లో ఓడిపోయారనే కారణం కన్నా.. ఆయనపై గెలిచిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి పార్టీ ఇచ్చిన హామీ మేరకు మళ్లీ ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాల్సివచ్చింది. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌లో చేరిన ఇతర పార్టీల సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టిక్కెట్లు ఇచ్చిన బీఆర్ఎస్ ఒక్క రోహిత్‌రెడ్డిని పక్కన పెట్టలేకపోయింది. సీనియర్ నేత మహేందర్‌రెడ్డికి పార్టీ పరిస్థితిని వివరించి ఒప్పించాలని ప్రయత్నించింది బీఆర్ఎస్.

Also Read: మూడు చోట్ల దరఖాస్తు చేసిన పొంగులేటి.. మిగతా రెండు స్థానాలు వారిద్దరి కోసమేనా?

టిక్కెట్ దక్కకపోవడంతో గోడ దూకేస్తారనే భయంకన్నా.. ఆయనకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుందనే సమాచారాన్ని స్వయంగా చెప్పాలని మంత్రి హరీశ్‌రావును ఆదేశించారు సీఎం కేసీఆర్. అదేసమయంలో మహేందర్‌రెడ్డి ప్రాధాన్యాన్ని గుర్తించారు. మహేందర్‌రెడ్డి పరిస్థితిని అవకాశంగా చేసుకుని ప్రత్యర్థులు విసిరే గాలానికి చిక్కకుండా ఆయన్ను కాపాడుకోవాలని చాణక్యం ప్రదర్శించారు సీఎం కేసీఆర్. అనుకున్నదే తడువుగా మహేందర్‌రెడ్డిని మంత్రి చేస్తానని చెప్పి.. కేవలం రెండు రోజుల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఎన్నికల ముందు మంత్రి వర్గ విస్తరణేంటి? అన్న ప్రత్యర్థుల విమర్శల కన్నా.. పార్టీలో సమర్థుడైన నాయకుడిని కాపాడుకోవడానికే పెద్దపీట వేశారు సీఎం కేసీఆర్. ఎప్పుడన్న సమయం కాదు ప్రత్యర్థులకు చెక్ చెప్పామా? లేదా? అన్నదే సీఎం కేసీఆర్ వ్యూహం. ఎవరు ఏమనుకున్నా.. మహేందర్‌రెడ్డిని మంత్రిని చేసి పార్టీలో గౌరవం కల్పించాలని డిసైడ్ అవ్వడం.. ఆయన కూడా ఆ ప్రతిపాదనకు అంగీకరించడంతో బీఆర్ఎస్‌లో పెను తుఫాన్ పురిట్లోనే చప్పున చల్లారిపోయింది. మహేందర్‌రెడ్డి మనసు మార్చుకోవడం ద్వారా ఆయనతోపాటు పక్కచూపులు చూసిన తీగల కృష్ణారెడ్డి, కేఎస్ రత్నం వంటి సీనియర్ నేతలు కూడా సైలెంట్ అయిపోయారు.

Also Read: అల్లుడికి బీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చినా కేసీఆర్‭తో ఫైట్ ఆగదంటున్న సర్వే సత్యనారాయణ

మహేందర్‌రెడ్డికి మంత్రి ఇవ్వడం ద్వారా అసంతృప్తి తుఫాన్‌ను ఆదిలోనే అడ్డుకోవడంతోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ అభ్యర్థుల విజయానికి లైన్‌క్లియర్ చేసింది బీఆర్ఎస్. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఓడించిన మహేందర్‌రెడ్డి కుటుంబంపై మరింత బాధ్యత పెంచినట్లైంది. రాజేంద్రనగర్, చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో పట్టు బిగించింది బీఆర్ఎస్. మహేందర్‌రెడ్డి విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించినా.. ప్రత్యర్థులు మరింత అగ్గిరాజేసి ఎన్నికల్లో లబ్ధిపొందే అవకాశం ఉండేది. కానీ, ప్రతిపక్షాలకు ఆ అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించిన కేసీఆర్.. వారి ఎత్తులకు పైఎత్తు వేసి మహేందర్‌రెడ్డిని అందలం ఎక్కించారు. దాదాపు ఏడాదిన్నరగా ఖాలీగా ఉన్న బెర్త్ ను మహేందర్రెడ్డితో భర్తీ చేయడం ద్వారా కాంగ్రెస్ ఎత్తుకు పైఎత్తు వేశారు గులాబీబాస్. ఎన్నికల వేళ మహేందర్‌రెడ్డి చేజారకుండా కేసీఆర్ వ్యూహం రచించారా.. లేదా ఆయన బెదిరింపులకు కేసీఆర్ లొంగారా.. అనేది పక్కన పెడితే.. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు జరిపిన కేబినెట్ విస్తరణ మాత్రం రాష్ట్రరాజకీయాల్లో ప్రస్తుతం హాట్‌టాపిక్.

ట్రెండింగ్ వార్తలు