హైదరాబాద్ చందానగర్‌లో ఒంటికి నిప్పంటించుకుని వివాహిత ఆత్మహత్య

  • Publish Date - July 14, 2020 / 03:07 PM IST

హైదరాబాద్ నగరంలోని చందానగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాన్ పల్లి తండాలో ఓ అపార్టుమెంటులో నివాసం ఉంటున్న కంకణాల స్రవంతి ఒంటికి నిప్పంటించుకుని బలన్మరణం చెందింది. భర్త సంతోష్, అత్తా-మామల వేధింపులే స్రవంతి ఆత్మహత్యకు కారణమని ఆమె కుంటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

పెళ్లయిన మూడేళ్లకే:
స్రవంతికి సంతోష్ కుమార్‌తో 2017లో వివాహం జరిగింది. వారికి రెండేళ్ల బాబు ఉన్నాడు. నిన్న(జూలై 13,2020) రాత్రి కూడా భర్త సంతోష్, అత్త మామలతో గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన స్రవంతి మంగళవారం(జూలై 14,2020) తెల్లవారుజామున ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

భార్య, భర్తల మధ్య తగాదాలు:
భార్య, భర్తల మధ్య చిన్నపాటి తగాదాలు ఉన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. భర్త, అత్త మామలను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు. స్రవంతి మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదని వాపోయారు.