భర్తను చంపేసి, అతడి మృతదేహాన్ని 800 కిలోమీటర్ల దూరంలో పడేసింది ఓ భార్య. గుర్తు తెలియని మృతదేహాన్ని గురించి కేసును దర్యాప్తు చేసిన పోలీసులు.. అతడిని భార్యే రూ.8 కోట్ల కోసం హత్య చేసిందని తేల్చారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని కొడగు జిల్లాలోని కాఫీ తోటలో మూడు వారాల క్రితం కాలిపోయి ఉన్న స్థితిలో ఓ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. అది హైదరాబాద్ శివారులోని ఉప్పల్‌కు చెందిన రమేశ్ (54) అనే వ్యాపారవేత్తదని పోలీసులు తేల్చారు.
అతడు కనపడకుండాపోయాడని కొన్ని వారాలే క్రితమే కేసు నమోదైంది. రమేశ్ భార్య నిహారిక, ఆమె ప్రేమికుడు నిఖిల్ మరొక నిందితుడు అంకుర్ కలిసి రమేశ్ వద్ద ఉన్న డబ్బును కాజేయడానికి అతడి హత్యకు పథకం వేశారని పోలీసులు దర్యాప్తులో నిర్ధారించారు.
రమేశ్‌కు చెందిన మెర్సిడెస్ కారులో అతడి మృతదేహాన్ని ఉంచి దాన్ని పారేసేందుకు రాష్ట్ర సరిహద్దుల మీదుగా ఆ వాహనాన్ని తీసుకెళ్లారు. మెర్సిడెస్ కారును పోలీసులు ట్రాక్ చేయడంతో ఈ విషయం నిర్ధారణ అయింది. ఈ నెల 8న కొడగులోని సుంటికొప్ప సమీపంలోని కాఫీ తోటలో కాలిపోయిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
అక్కడి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఎరుపు రంగు మెర్సిడెస్ బెంజ్ కారు కనపడింది. అది రమేశ్ పేరుతో తెలంగాణలో రిజిస్టర్ అయినట్లు పోలీసులు గుర్తించారు. అతని భార్య ఇటీవల మిస్సింగ్ ఫిర్యాదును నమోదు చేసింది. దర్యాప్తు సాగుతున్న కొద్దీ రమేశ్ భార్య నిహారిక (29)పై పోలీసులకు అనుమానం పెరిగింది. ఆమెను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా రమేశ్‌ను చంపింది తామేనని అంగీకరించింది.