దానం నాగేందర్.. పక్కా పొలిటికల్ లీడర్. అంటే పవర్ ఎక్కడుంటే ఆయన అక్కడుంటారనేది పొలిటికల్ సర్కిల్‌లో ఎప్పటినుంచో ఉన్న చర్చ. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి..ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరిన దానం..సికింద్రబాద్ లోక్‌సభ ఎంపీగా హస్తం గుర్తుపై పోటీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు కోసం బీఆర్ఎస్ న్యాయపోరాటం చేస్తోంది. జులై 14తర్వాత కోర్టు కార్యకలాపాలు పూర్తిస్థాయిలో స్టార్ట్ అయితే..బీఆర్ఎస్ వేసిన పిటిషన్లపై ఎప్పుడైనా తుది తీర్పు రావొచ్చని భావిస్తున్నారు.
దానం డిస్‌క్వాలిఫై అవడం కూడా పక్కా అన్న చర్చ ఉంది. అయితే జూబ్లీహిల్స్ బైపోల్ వస్తుండటంతో..దానం నాగేందర్ పెద్ద స్కెచ్చే వేశారట. గ్రేటర్ కోటాలో మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్న ఆయన..అటు అనర్హత భయాన్ని..ఇటు జంపింగ్ ఎమ్మెల్యే అనే పేరును పోగొట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం తాను రాజీనామా చేస్తే జూబ్లీహిల్స్‌తో పాటు ఖైరతాబాద్ సీటుకు బైపోల్ వస్తుందని కాంగ్రెస్ పెద్దల దృష్టికి తీసుకెళ్లారట. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను గెలిపిస్తా.. ఖైరతాబాద్‌లో తాను మళ్లీ పోటీ చేసి గెలుస్తా..బట్ వన్ కండీషన్ మంత్రి పదవి ఇవ్వాలంటున్నారట దానం.
అయితే కాంగ్రెస్‌లో చేరినప్పుడే దానంకు మంత్రి పదవి ఇస్తానని సీఎం రేవంత్ హామీ ఇచ్చారట. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేయడంతో..న్యాయపరంగా చిక్కులు వస్తాయని దానంకు మినిస్ట్రీ ఇవ్వడం లేదన్న టాక్ నడుస్తోంది. అయితే మంత్రి పదవి కోసం అటు జూబ్లీహిల్స్, ఇటు ఖైరతాబాద్ రెండు స్థానాలను గెలిపించే బాధ్యత తీసుకుంటానని అంటున్నారట దానం. గతంలో తనకు ఇచ్చిన హామీ ప్రకారం మంత్రి పదవి ఇస్తానంటేనే రాజీనామాకు రెడీ..జూబ్లీహిల్స్ బాధ్యతలు తీసుకోవడానికి కూడా ఓకే అంటున్నారట.
దీనంతటికి కారణం మంత్రి పదవి మీద ఆశే?
ఖైరతాబాద్‌తో పాటు జూబ్లీహిల్స్‌లో కూడా తనకు పట్టుందని.. అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా గెలిపించే బాధ్యత తీసుకుంటానని దానం ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో దానం యాక్టివిటీ పెంచారు. ఏఐసీపీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వచ్చిన సందర్భంగా సిటీ ప్లెక్సీలతో హంగామా చేశారు. గాంధీభవన్‌లో జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఇలా మొత్తం మీద దానం మళ్లీ పూర్తిస్థాయి కాంగ్రెస్ మనిషిగా మారిపోతున్నారట. దీనంతటికి కారణం మంత్రి పదవి మీద ఆశే అంటున్నారు. అందుకోసం రేపోమాపో ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి..తిరిగి కాంగ్రెస్ తరపున బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నారట.
అన్ని ఈక్వేషన్స్ అనుకున్నట్లుగా కుదిరితే ఈ వారం రోజుల్లోనే దానం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నెలాఖరులో చేపట్టే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు బెర్త్ దక్కడం కూడా ఖాయమంటున్నారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేశాక..వచ్చే ఉపఎన్నికల్లో మంత్రిపదవి హోదాలోనే దానం బైపోల్ బరిలో దిగనున్నారనే టాక్ వినిపిస్తోంది. దానం ఎత్తులు వర్కౌట్ అవుతాయా.? మంత్రి పదవి దక్కుతుందా అనేది చూడాలి మరి.