BRS: బీఆర్ఎస్‌లో కవితకు కీలక పదవి కట్టబెడతారా..? కీ రోల్‌..

కవితకు పార్టీలో కీలక పదవి అప్పగిస్తే క్యాడర్‌లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయట.

MLC Kavitha

బీఆర్‌ఎస్ పార్టీలో కీలక పదవి కోసం కవిత పట్టుబడుతున్నారా.. పార్టీ అధినేత కేసీఆర్ సైతం కవితను రంగంలోకి దించే ఆలోచన చేస్తున్నారా.? ఇదే నిజమైతే బీఆర్ఎస్‌ కుటుంబ పార్టీ అనే ముద్ర మరింత బలపడుతుందని విమర్శలు వినిపిస్తున్నాయా.. అసలు కవిత పోస్ట్ విషయంలో తెలంగాణ భవన్‌లో వినిపిస్తున్న గాసిప్స్ ఏంటి?

తెలంగాణలో ప్రతిపక్షహోదాకు బీఆర్ఎస్ ఏడాదిన్నర పూర్తిచేసుకుంది. రేవంత్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ, హామీల అమలుపై నిలదీస్తూ, ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తూ వస్తూ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది బీఆర్‌ఎస్.. ఓవైపు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే.. మరోవైపు తమ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టింది అధిష్టానం.

ఇందులో భాగంగానే బీఆర్ఎస్ ఆవిర్భవించి 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఈనెల 27న వరంగల్‌లో భారీ బహిరంగసభను ఏర్పాటు చేస్తోంది. సభను సక్సెస్ చేసిన తర్వాత పార్టీ పునర్ నిర్మాణంపై దృష్టిసారించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిసైడ్ అయ్యారు. పార్టీ అనుబంధ విభాగాల్ని కూడా యాక్టివేట్‌ చేసేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట.

నేరుగా పదవి ఉంటేనే రాజకీయ ఎదుగుదల?
ఇదే సమయంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న కవిత.. బీఆర్ఎస్ పార్టీలో కీ రోల్‌ ప్లేచేసే ఆలోచన చేస్తున్నారట. జాగృతి కంటే పార్టీలో నేరుగా పదవి ఉంటేనే రాజకీయ ఎదుగుదల ఉంటుందని కవిత భావిస్తున్నారట.

లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి వచ్చాక కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న కవిత.. ఇప్పుడు వరుస కార్యక్రమాలతో ప్రజల్లో ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అటు జ్యోతిరావుఫూలే ఫ్రంట్ పేరుతో పలు కార్యక్రమాలు చేస్తూ బీసీలకు కూడా దగ్గరయ్యేందుకు అడుగులు వేస్తున్నారు. ఇటీవల కాలంలో పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలతో పాటు కొన్ని కార్యక్రమాలను సొంతంగా ప్లాన్ చేసుకుంటున్నారు కవిత.

ఐతే తెలంగాణ జాగృతి పేరుతో ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా.. ఊహించినంతా రేంజ్‌లో మైలేజ్‌ రాలేదని భావిస్తున్నారట కవిత. అందుకే బీఆర్‌ఎస్‌ పార్టీలో కీలక పదవిలో ఉండి కార్యక్రమాలను చేయాలనే ఆలోచన చేస్తున్నారనే గాసిప్స్ తెలంగాణభవన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవీ ఉన్నా.. ఆ పదవితో రాష్ట్రం మొత్తం తిరగడం కాస్త ఇబ్బందిగా ఉంటుందట.

అందుకే బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్రస్థాయి పదవి.. అది కూడా కీలకమైనది తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారని బలమైన టాక్‌ వినిపిస్తోంది. పార్టీలో తాను ఆశిస్తున్న పదవి గురించి తండ్రి కేసీఆర్ దగ్గర ప్రస్తావించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొన్న తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ కూడా కవిత ప్రస్తావన తీసుకువచ్చారట. తెలంగాణ జాగృతి తరఫున ఆమె కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారని.. పార్టీ కూడా సపోర్ట్ ఇవ్వాలంటూ చెప్పినట్లు తెలుస్తోంది.

కేసీఆర్‌ని కన్విన్స్ చేస్తున్నారా?
బీఆర్ఎస్‌లో కీలక పదవి తీసుకొని కవిత ప్రజల్లోకి వెళ్తే.. పార్టీకి లాభం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తుందట గులాబీ సైన్యం. కవిత అల్రెడీ ఏదో ఒక కార్యక్రమంలో ప్రజల్లోనే ఉంటున్నారు. ఇక పెద్ద పదవితో వెళ్తే.. ఎఫెక్టివ్‌గా ఉంటుందని అనుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి బీఆర్ఎస్ కంటే ఎక్కువగా జాగృతి కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇదే ఊపుతో పార్టీ పదవి తీసుకుని జనాల్లోకి వెళ్తే.. ఇంకా కలిసి వస్తుందని కేసీఆర్‌ని కన్విన్స్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ ఉన్నారు. కవితకు కూడా ఆ స్థాయిలోనే ఓ పదవిని క్రియేట్‌ చేసి ఇస్తే బాగుంటుందన్న చర్చ గులాబీ పార్టీలో మొదలైందట. పార్టీలో ఖాళీగా ఉన్న సెక్రటరీ జనరల్ కానీ, లేదంటే వైస్ ప్రెసిడెంట్ పదవిని కొత్తగా క్రియేట్ చేసి గానీ కవితకు కట్టబెట్టవచ్చనే ప్రచారం బీఆర్ఎస్‌ పార్టీలో జోరందుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేసీఆర్‌కు క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం.

అయితే కవితకు పార్టీలో కీలక పదవి అప్పగిస్తే క్యాడర్‌లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయట. ఐతే ప్రాంతీయ పార్టీల్లో ఏదైనా సాధ్యమే అన్నది మరోవర్గం వినిపిస్తున్న వాదన. ఇవన్నీ పక్కనపెడితే కవితకు బీఆర్‌ఎస్‌లో కీలక పదవి అంటూ ఊహాగానాలయితే ఊపందుకున్నాయి. అవి ఎంతవరకు నిజమనేది తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.