KCR
KCR: తెలంగాణ అసెంబ్లీ సెషన్‌కు అంతా రెడీ అవుతోంది. మరో రెండ్రోజుల్లో శాసన సభా సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. అయితే ఇప్పటిదాక జరిగిన అసెంబ్లీ సెషన్ ఒక ఎత్తు అయితే..ఈసారి సమావేశాలు చాలా స్పెషల్. ఓ వైపు కాళేశ్వరం..మరోవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్, కృష్ణానదీ జలాల ఇష్యూ, ఫార్ములా ఈ కార్ రేస్..ఇలా ఎన్నో అంశాల చుట్టూ చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ మధ్యే ప్రెస్‌మీట్ పెట్టి గులాబీ బాస్ సర్కార్ మీద అటాక్ చేయడం మొదలుపెట్టడంతో..కేసీఆర్ టార్గెట్‌గా అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోందట.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు కృష్ణా గోదావరి జలాలపై బీఆర్ఎస్ లేవనెత్తిన అభ్యంతరాల విషయంలో కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక దృష్టి పెడుతోంది. తెలంగాణకు నీటివాటాల్లో అన్యాయం జరగడానికి కేసీఆరే కారణమంటూ ఎక్స్‌పోజ్ చేసే ప్రయత్నాలు స్పీడప్ చేస్తోందట రేవంత్ ప్రభుత్వం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో సహా అన్ని అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌కు రేవంత్ సవాల్ విసిరారు. ఇందులో భాగంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సహా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టాలని, ఎక్కడికక్కడ ఘాటుగా ఎండగట్టాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్.
Also Read: సౌమ్యుడిగా ఉండే ఆ లీడర్ ఎందుకు సంచలన కామెంట్స్ చేసినట్లు?
బీఆర్‌ఎస్ హయాంలో గోదావరి, కృష్ణా నీటి వాటాల విషయంలో జరిగిన అన్యాయాన్ని లెక్కలతో నిలదీయాలని సీఎం రేవంత్ సూచించారు. కేసీఆర్ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదన్న విషయాన్ని అసెంబ్లీ వేదికగా గట్టిగా చెప్పాలని భావిస్తున్నారట. బీఆర్‌ఎస్ వైపల్యాలను అసెంబ్లీలో ఎండగట్టాలని..నీళ్లు నిజాలు అనే అంశాన్ని ప్రధానంగా తీసుకొని ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యారట. నదీజలాల వాటాల విషయంలో బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలతో జరిగిన నష్టమేంటో వివరించబోతున్నారట. ఇలా కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ను ఇరకాటంలో పెట్టేలా రేవంత్ వ్యూహరచన చేస్తున్న క్రమంలో గులాబీ దళపతి అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్నదే హాట్ టాపిక్ అవుతోంది.
2024 బడ్జెట్ సెషన్‌కు హాజరై కొద్ది సేపు ఉన్న కేసీఆర్
ఈ మధ్యే మీడియా ముందుకు వచ్చి మరీ రేవంత్ సర్కార్‌కు వార్నింగ్ ఇచ్చిన కేసీఆర్.. అసెంబ్లీ సమావేశాలకు వస్తారా రారా అన్నదానిపై మాత్రం డైలమా కొనసాగుతోంది. ప్రతిపక్షంలోకి వచ్చాక గులాబీ బాస్ రెగ్యులర్‌గా అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదు. 2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరగా.. ఆ సమయంలోనే మాజీ సీఎం కేసీఆర్ బాత్ రూమ్‌లో జారిపడటంతో తుంటి ఎముక ఫ్యాక్చర్ అయ్యింది.
దీంతో సర్జరీ తర్వాత బెడ్ రెస్టులో ఉన్నారు. తర్వాత స్పీకర్ ఛాంబర్‌లో గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. 2024లో జరిగిన బడ్జెట్ సెషన్‌కు హాజరై కొద్ది సేపు ఉండి వెళ్లి పోయారు. తర్వాత ఈ ఏడాది ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు హాజరయ్యారు. ఆ తర్వాత జరిగిన శాసనసభ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొనలేదు. ఏ చర్చలో పాల్గొనలేదు. ఇక ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ వస్తారా లేదా అన్నదే ఆసక్తిరేపుతోంది.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కృష్ణా జలాలలపై చర్చించనున్న ఈ కీలక సమయంలో అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరైతేనే బావుంటుదన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది. ఇదే సమయంలో ఫామ్‌హౌజ్‌లో కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ సమావేశాలు, కృష్ణా జలాలపై చర్చ తదితర అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేసీఆర్ సభకు హాజరవుతారా లేదా అన్నది మాత్రం ఏ బీఆర్ఎస్ నేత క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి.