పండుగల్లో రక్షాబంధన్ చాలా స్పెషల్ అని చెప్పాలి. అలాంటి రాఖీ పౌర్ణమి రాబోతున్న వేళ..అటు బీఆర్ఎస్‌లోనూ..ఇటు తెలంగాణ సమాజంలో ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ కవిత తన సోదరుడు కేటీఆర్‌కు ఈ సారి రాఖీ కడతారా.? ఆమె రాఖీ కట్టాలనుకున్నా అన్న సమయం ఇస్తారా.? అందరి డౌట్ ఇదే. పైగా బీఆర్ఎస్ బీసీ గర్జన సభకు కూడా కవిత హాజరవుతారా లేదా అన్న డైలమా ఉంది. కేసీఆర్‌కు కవిత లేఖ..ఆ లెటర్ లీక్..తర్వాత కేటీఆర్‌పై కవిత ఇండైరెక్ట్ కామెంట్స్..లేటెస్ట్‌గా మీడియా ఇంటర్వ్యూల్లో ఆమె చేస్తున్న వ్యాఖ్యలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీతోనే కాదు ఫ్యామిలీతో కూడా కవితకు చెడినట్లే కనిపిస్తోంది.
కవిత మాత్రం పార్టీ నాదే..ఫ్యామిలీలో కూడా ఎవరితో విభేధాలు లేవు. కేటీఆర్‌తో రిలేషన్ విషయంలో ఏ ఇబ్బంది లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి రాఖీ పండుగ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. ప్రతి సంవత్సరం రక్షాబంధన్ రోజు తన సోదరుడు కేటీఆర్‌కు ఎంతో ప్రేమతో రాఖీ కడుతుంటారు కవిత. అంతేకాదు కేటీఆర్‌కు రాఖీ కట్టి..పబ్లిక్‌కు అవేర్నెస్ కల్పించేలా అన్నకు హెల్మెట్‌ను కూడా గిఫ్ట్‌గా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.
కానీ ఇప్పుడు పరిస్థితి అప్పటిలా లేదు. కొన్నాళ్లుగా కేసీఆర్ కుటుంటానికి కవిత దూరంగా ఉంటున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు..కవితను పెద్దగా పట్టించుకోవడం లేదు. కవిత పేరు తీయడానికి కేసీఆర్, కేటీఆర్ ఇష్టపడని ఈ సిచ్యువేషన్‌లో ఆమె రాఖీ కడుతుందా.? కవిత రాఖీ కట్టాలనుకున్నా కేటీఆర్ టైమ్ ఇస్తారా ఇప్పుడిదే చర్చనీయాంశం అవుతోంది. పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ రాఖీ పౌర్ణమికి రిస్ట్రిక్షన్స్‌ఏం ఉండవు..రామన్నకు రాఖీ కడుతానంటూ చెప్పుకొస్తున్నారు కవిత.
Chiranjeevi- Revanth Reddy : మెగాస్టార్ చిరంజీవికి సీఎం రేవంత్ బంపర్ ఆఫర్?
సరిగ్గా ఏడాది కింద ఇదే సమయానికి ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత తీహార్ జైలులో ఉన్నారు. సరిగ్గా ఇదే సమయానికి రాఖీ పండుగ రానే వచ్చింది. అప్పటికి కవిత ఇంకా బయటికి రాలేదు. దీంతో బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు కేటీఆర్‌కు రాఖీలు కట్టారు. కవిత లేని లోటును తీర్చారు. రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చేతులు నిండిపోయినట్లు కేటీఆర్ రెండు చేతులు నిండా రాఖీలు కట్టి..హారతి ఇచ్చారు బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు. కవిత బెయిల్‌పై విడుదలైన తర్వాత తన సోదరుడు ఇంటికి వెళ్లి..రాఖీ కట్టింది. ఏడాది కింద ఆ సీన్ ఉంటే ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీలో డిఫరెంట్ సినారియో కనిపిస్తోంది.
అప్పుడేమో చెల్లి కష్టాల్లో ఉందని..అన్న బాధ పడితే..ఇప్పుడు ఆమె పెట్టిన కుంపటితో కేసీఆర్, కేటీఆర్ సఫర్ అవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీలో ఉండి..అసంతృప్తి రాగం వినిపిస్తూ..రచ్చకు లాగుతున్నారని ఆమె తీరుపై కోపంగా ఉన్నారన్న టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ కవిత రాఖీ కట్టడానికి వెళ్తే.. కేటీఆర్ అందుబాటులో ఉంటారో లేదోనన్న డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి.
మరోవైపు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ఆ సభకు కూడా కవిత హాజరు అవుతారో లేదో క్లారిటీ లేదు. బీఆర్ఎస్ బీసీ గర్జన సభకు అటెండ్ అవుతారా అని మీడియా అడిగిన ప్రశ్నకు దాటవేసే సమాధానం చెప్పారు కవిత. ఒకవేళ ఆహ్వానం అందితే వెళ్తానంటూ చెప్పుకొచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ప్రత్యేకంగా ఆహ్వానం ఏం ఉండదు. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా..సభలు పెట్టినా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎమ్మెల్సీలు ముందు నడవడం కామన్. కానీ పిలిస్తే బీఆర్ఎస్ సభకు వెళ్తానని కవిత అంటున్నారంటే..పార్టీలో లేనని కవిత చెప్పకనే చెప్పినట్లు అయింది.
ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్‌తో పాటు రాజకీయాల్లో వర్గాల్లో, తెలంగాణ సమాజంలో..అటు రాఖీ సెలబ్రేషన్స్ ఇటు బీఆర్ఎస్ సభ ఈ రెండింటి విషయంలో కవిత సెంట్రిక్‌గా చర్చ జరుగుతోంది. కవిత కేటీఆర్‌కు రాఖీ కడుతారా.? బీఆర్ఎస్ సభకు వెళ్తారా అన్న రెండు ప్రశ్నలు..ఇప్పటికైతే ఆన్సర్ లేని క్వశ్చన్స్‌గానే ఉన్నాయి. త్వరలోనే రాఖీ పౌర్ణమి ఉండటంతో కేటీఆర్‌కు కవిత రాఖీ కట్టే విషయంపై క్లారిటీ రానుంది. బీఆర్ఎస్ సభ విషయంలోనూ ఈ నెల రెండో వారంలో కవిత పార్టీలో ఉన్నారో..లేక సెపరేట్‌గా కొనసాగుతున్నారో మరింత క్లారిటీ రానుంది.