Extramarital Affair : వివాహేతర సంబంధం.. ప్రియుడి కోసం భర్త, అత్తను చంపేందుకు ప్లాన్.. కానీ, చివరిలో షాకింగ్ ట్విస్ట్..
Extramarital Affair : నిజామాబాద్ జిల్లాలో ఓ మహిళ తన వివాహేతర సంబంధానికి అడ్డుగాఉన్నారనే కక్షతో భర్త, అత్తను హత్య చేసేందుకు ప్రయత్నించింది.
- Harish Thanniru
- Published on- August 4, 2026 / 08:03 AM IST
Extramarital Affair : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని ఓ మహిళ దారుణానికి పాల్పడింది. భర్త, అత్తను చంపేందుకు ప్లాన్ వేసింది. ముందస్తుగా అనుకున్న ప్రకారం.. ఇంట్లో వండిన మిల్ మేకర్ కూరలో గడ్డి మందు కలిపింది. ఆ కూరను తిన్న అత్త తీవ్ర అస్వస్థతకు గురికాగా.. పురుగుల మందు వాసన రావడంతో భర్త కొంచెం తిని పక్కన పడేశారు. దీంతో అతను కూడా స్వల్ప అస్వస్థకు గురయ్యాడు. వీరిద్దరిని స్థానికులు సకాలంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా.. ప్రాణాప్రాయం నుంచి బయటపడ్డారు. భార్యపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో ఆమె అసలు విషయం ఒప్పుకుంది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చోసుకోగా.. స్థానికంగా సంచలనం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : Telangana Rains : తెలంగాణలోని ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు.. భీకర గాలులు.. హెచ్చరికలు జారీ..
మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముదక్‌పల్లి గ్రామానికి చెందిన పొట్టోళ్ల సోనీ తన భర్త భూమన్న అలియాస్ భూమయ్య, అత్త భూదేవవ్వను హతమార్చేందుకు ప్లాన్ వేసింది. కొద్దికాలంగా ఓ వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ప్రియుడితో కలిసి ఉండేందుకు భర్త, అత్త అడ్డుగా ఉన్నారని భావించిన సోనీ.. వారిని హత్య చేయాలని పథకం వేసింది.
ఆగస్టు 1వ తేదీన ఇంట్లో వండిన మీల్ మేకర్ కూరలో గడ్డి మందు కలిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. మధ్యాహ్నం అత్త భూదేవవ్వ ఆ కూరతో భోజనం చేయగా కొద్దిసేపటికే తీవ్ర వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైంది. అదే కూరను భర్త భూమన్న తినే సమయంలో పురుగుమందు వాసన రావడంతో అనుమానం వచ్చి భోజనం పక్కన పెట్టాడు. అయినప్పటికీ అతడికి కూడా అస్వస్థత లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఇద్దరినీ వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మోపాల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానితురాలిగా భావించిన సోనీని అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసుల విచారణలో తానే కూరలో గడ్డి మందు కలిపానని సోనీ ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.
