Niloufer Hospital : హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో ఒకే కాన్పులో నలుగురు పిల్లలు.. తల్లి, బిడ్డలు క్షేమం

నెలలు నిండకుండానే పుట్టినందు వల్ల శ్వాస సంబంధిత సమస్యతో వెంటిలేటర్ అవసరమైందని తెలిపారు

Niloufer Hospital : హైదరాబాద్ లో ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది ఓ గర్భిణి. తల్లి, పిల్లలు అంతా క్షేమంగా ఉన్నారు. హస్తినాపూర్ కు చెందిన అమృత గత నెల 22న నీలోఫర్ చిల్డ్రన్ హాస్పిటల్ లో చేరారు. ఏడున్నర నెలలకే పురిటి నొప్పులు రావడంతో నీలోఫర్ హాస్పిటల్ లో ఇన్ పేషంట్ గా అడ్మిట్ అయ్యారు. వైద్యులు వెంటనే ఆమెకు ఆపరేషన్ చేశారు.

ఒకే కాన్పులో నలుగురికి జన్మనిచ్చింది అమృత. వీరిలో ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. పిల్లల బరువు ఒక్కొక్కరిది వేర్వేరుగా ఉంది. ఒక్కొక్కరు కిలోన్నర లోపు బరువుతో పుట్టారని డాక్టర్లు తెలిపారు. నెలలు నిండకుండానే పుట్టినందు వల్ల శ్వాస సంబంధిత సమస్యతో వెంటిలేటర్ అవసరమైందని తెలిపారు నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ రవికుమార్. ప్రస్తుతం నలుగురు శిశువుల బరువు పెరిగిందని తెలిపారాయన.

Also Read : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హైటెన్షన్.. భారీగా పోలీసులు మోహరింపు

”ఒకే కాన్పులో నలుగురు పిల్లలు పుట్టారు. నలుగురు పిల్లలు కిలోకన్నా తక్కువ బరువు ఉన్నారు. నెల రోజుల క్రితం ఇది జరిగింది. శిశువులకు తాగటం రాలేదు, టెంపరేచర్ మెయింటేన్ చేయట్లేదు, ఆక్సిజన్ అందివ్వాల్సి వచ్చింది. ఇవన్నీ ఇచ్చుకుంటూ 35 రోజులు చూసుకున్నాం. నీలోఫర్ ఆసుపత్రిలో హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ఉంది. అక్కడి నుంచి కొంత మిల్క్ తీసుకుని బేబీలను సేవ్ చేయడం జరిగింది” అని నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ రవికుమార్ తెలిపారు.

 

అమృత (24) అనే గర్భిణి ఫిబ్రవరి 22న నీలోఫర్ ఆసుపత్రిలో చేరారు. అప్పుడామె ఏడున్నర నెలల గర్భిణి. అకాల ప్రసవ నొప్పులతో ఆమె ఆసుపత్రిలో చేరింది. సిజేరియన్ ద్వారా నలుగురు బిడ్డలను ప్రసవించారు. 1.6 కిలోలు, 1.5 కిలోలు, 1.4 కిలోలు, 1.2 కిలోల బరువుతో నలుగురు శిశువులకు జన్మనిచ్చారు. తక్కువ బరువుతో పుట్టడంతో వెంటనే వెంటిలేటర్ సాయం అవసరమైంది. నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్. రవి కుమార్, నియోనాటాలజీ విభాగం హెచ్‌ఓడి స్వప్న పర్యవేక్షణలో నలుగురు శిశువులను నీలోఫర్ ఆసుపత్రిలోని NICUలో చేర్చారు.

Also Read : తెలంగాణలో వృద్ధులకు 5లక్షల వరకు ఆరోగ్య బీమా.. ఏప్రిల్ నుంచి అమల్లోకి.. ఏఏ ఆస్పత్రుల్లో చికిత్స పొందొచ్చంటే..

శ్వాస సమస్యల కారణంగా వారిని 7 నుంచి 10 రోజులు మెకానిక్ వెంటిలేటర్‌లో ఉంచారు. ప్రారంభ రోజుల్లో శిశువులకు తల్లి పాలు ఇవ్వడం తల్లికి చాలా కష్టంగా ఉండేది. నీలోఫర్ ఆసుపత్రిలో ఉన్న హ్యూమన్ మిల్క్ బ్యాంక్ సాయంతో పిల్లలకు ఆహారం ఇవ్వగలిగాము. రోజులు గడిచేకొద్దీ శిశువుల పరిస్థితి మెరుగుపడి ఐసీయూ నుండి సాధారణ వార్డులకు తరలించారు.

సెప్సిస్, కామెర్లు, అప్నియా, ఆర్‌ఓపి వంటి అనేక సమస్యలతో శిశువులు పోరాడాల్సి వచ్చింది. వారిలో ఒక శిశువుకు కంటి శస్త్రచికిత్స కూడా అవసరమైంది. దీనికి సరోజిని దేవి కంటి ఆసుపత్రి వైద్యులు సాయం చేశారు. 35 రోజులు ఆసుపత్రిలోనే ఉన్నారు. తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. 1.7 కిలోలు, 1.92 కిలోలు, 1.86 కిలోలు, 1.54 కిలోల బరువుతో శిశువులు డిశ్చార్జ్ అయ్యారు. తల్లి, నలుగురు శిశువులు ఆరోగ్యంగా ఉన్నారు. శిశువులను కంటికి రెప్పలా కాపాడుకోవడంలో నియోనాటాలజీ విభాగం వైద్యుల కృషిని డాక్టర్ ఎన్. రవి కుమార్ అభినందించారు.