Hyderabad : పచ్చని కాపురంలో ఇన్‌స్టాగ్రామ్ చిచ్చు పెట్టింది. 13ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను, ముగ్గురు పిల్లలను వదిలేసి ఇన్‌స్టాలో పరిచయమైన వ్యక్తితో వెళ్లిపోయేందుకు మహిళ సిద్ధమైంది. దీంతో భార్యాభర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
వాసాల శ్రీధర్ (34), కల్యాణి (33) భార్యాభర్తలు. శ్రీధర్‌ది కరీంనగర్ జిల్లా కాగా.. కల్యాణిది ఖమ్మం జిల్లా. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. 13ఏళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. ప్రస్తుతం వారికి 11ఏళ్లు, తొమ్మిదేళ్లు, ఏడేళ్లు. హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలోని ఎల్లమ్మబండ, పీజేఆర్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. కల్యాణి ఇంటివద్దే ఉంటూ పిల్లలను చూసుకుంటుంది. శ్రీధర్ ఓ ప్రైవేట్ ఉద్యోగి.
కల్యాణి ఇన్‌స్టాగ్రామ్‌లో చురుగ్గా ఉండేది. ఈ క్రమంలో ఏపీలోని కర్నూల్ కు చెందిన వ్యక్తితో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. దీంతో ఆ వ్యక్తితో కల్యాణి నిత్యం ఫోన్లో మాట్లాడుతుండేది. ఈ విషయాన్ని గమనించిన భర్త శ్రీధర్ ఆమెను ప్రశ్నించాడు. పద్దతి మార్చుకోవాలని పలుమార్లు సూచించాడు. అయినా, కల్యాణి వినలేదు.
ఇన్‌స్టాలో పరిచయమైన వ్యక్తితో మాట్లాడుతూనే ఉండేది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవులు మొదలయ్యాయి. కొద్దిరోజులకు ఈ విషయం పెద్దల పంచాయతీ వరకు వెళ్లింది. కుటుంబ సభ్యులు, పెద్దలు సర్దిచెప్పినా కల్యాణి ప్రవర్తనలో మార్పురాలేదు.
భర్త గట్టిగా ప్రశ్నిస్తే.. విడాకులిస్తానంటూ కల్యాణి బెదిరించింది. ఈ క్రమంలో సోమవారం భార్యాభర్తల మధ్య మళ్లీ ఘర్షణ జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తికోసం నీకు విడాకులైనా ఇస్తాను తప్ప.. ఆ వ్యక్తిని నేను వదులుకోను అంటూ కల్యాణి తెగేసి చెప్పింది. అంతేకాక.. భర్త, ముగ్గురు పిల్లలను వదిలి ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు ఆమె సిద్ధమైంది.
ఆగ్రహంతో ఊగిపోయిన శ్రీధర్.. కల్యాణి గొంతు, మణికట్టు, మొహంపై కత్తితో దాడి చేశాడు. ఆ తరువాత శ్రీధర్ సైతం తన రెండు చేతుల మణికట్టుల వద్ద కోసుకొని కింద పడిపోయాడు. ఇంటిపక్కనే ఉన్న వ్యక్తులు ఈ ఘటనను గమనించి ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కల్యాణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.