Women Congress: వారి చుట్టాలకి కూడా పదవులు ఇస్తున్నారు, మాకెందుకివ్వరు? గాంధీభవన్‌లో రచ్చ రచ్చ.. మహిళా కాంగ్రెస్ నేతల ధర్నా..

గాంధీ భవన్ ముందు నిరసన చేస్తున్న మహిళా నేతలను రూమ్ లో బంధించి తాళం వేశారు సిబ్బంది.

Women Congress: తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ లో పదవుల చిచ్చు రేగింది. అధికారంలో లేనప్పుడు పార్టీలో కష్టపడ్డ మహిళా కాంగ్రెస్ కి పదవుల విషయంలో అన్యాయం జరిగిందంటూ హైదరాబాద్ గాంధీభవన్ ముందు మహిళా కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. పార్టీలో పని చెయ్యని వారికి పదవులు దక్కుతున్నాయంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలోని నాయకుల చుట్టాలకి సైతం పదవులు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు.

గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ చాంబర్ ముందు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు ధర్నా చేపట్టారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే కాంగ్రెస్ కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో, కార్పొరేషన్ పదవుల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కొంతకాలంగా మహిళల పట్ల వివక్ష చూపిస్తున్నారని సునీత రావు ప్రధానంగా ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీలో రెడ్డి, గౌడ్ లకు తప్ప మరొకరికి పదవులు ఇవ్వరా..? పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తన మరదలుకి కూడా పదవి ఇప్పించుకున్నారు. మహేశ్ గౌడ్ మరదలు ఏం పని చేసిందని ఆమెకు పదవి ఇచ్చారు..? అని సునీత రావు నిలదీశారు.

కాగా, గాంధీ భవన్ ముందు నిరసన చేస్తున్న మహిళా నేతలను రూమ్ లో బంధించి తాళం వేశారు గాంధీ భవన్ సిబ్బంది. విషయం తెలిసిన వెంటనే మహిళా నేతలతో ఫోన్ లో మాట్లాడారు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు మహిళా నేతలకు పదవులు ఇవ్వాలని వారు మహేశ్ కుమార్ గౌడ్ తో చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి పదవుల విషయంలో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు మహేశ్ కుమార్ గౌడ్. ఆయన ఇచ్చిన హామీతో మహిళా కాంగ్రెస్ నేతలు ధర్నా విరమించారు.