Yadadri Temple: యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్.. మళ్లీ మొదలైన తులాభారం, తోమాల సేవలు.. ఆలయ అధికారుల కీలక ప్రకటన!
యాదగిరిగుట్ట(Yadadri Temple) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో తులాభారం, తోమాల ఆర్జిత సేవలను ఆలయ అధికారులు తిరిగి పునరుద్ధరించి భక్తులకు అందుబాటులోకి తెచ్చారు.
- V Santhosh Kumar
- Published on- November 12, 2026 / 08:30 PM IST
Yadadri temple resumes thulabharam and thomala seva for devotees ticket details
Yadadri Temple: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి(Yadadri Temple) విచ్చేసే భక్తులకు ఆలయ అధికారులు తీపి కబురు అందించారు. భక్తుల చిరకాల కోరిక మేరకు ఆలయంలో గతంలో నిలిచిపోయిన అత్యంత విశిష్టమైన ‘తులాభారం’, ‘తోమాల’ ఆర్జిత సేవలను తిరిగి పునరుద్ధరించినట్లు ఆలయ ఈఓ భవాని శంకర్, ప్రధాన అర్చకులు వెల్లడించారు. 2025 డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఈ సేవలు కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్దిరోజులకే నిలిచిపోగా, తాజాగా ఆలయ యంత్రాంగం వీటిని మళ్లీ అందుబాటులోకి తెచ్చింది.
రూ.1250 టికెట్‌తో తోమాల సేవ.. గర్భాలయ దర్శనంతో పాటు ప్రత్యేక ప్రసాదాలు:
ఈ సేవల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం నిత్య సహస్రనామార్చన అనంతరం గర్భాలయంలో అరగంట పాటు అత్యంత వైభవంగా తోమాల సేవను నిర్వహిస్తారు. రూ.1,250 టికెట్ కొనుగోలు చేసిన దంపతులకు ఈ సేవలో పాల్గొనే అరుదైన అవకాశం లభిస్తుంది. టికెట్ తీసుకున్న భక్తులకు గర్భాలయ ప్రవేశంతో పాటు స్వామివారి శాలువా, కుంకుమ, అభిషేకం లడ్డూ ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేస్తారు.
మొక్కులు చెల్లించుకునేందుకు తులాభార సేవ.. సద్వినియోగం చేసుకోవాలని ఈఓ పిలుపు:
అదేవిధంగా భక్తులు తమ మొక్కులను భక్తిశ్రద్ధలతో చెల్లించుకునేందుకు వీలుగా స్వామివారి సన్నిధిలో తులాభార సేవను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఈఓ భవాని శంకర్ తెలిపారు. పునరుద్ధరించిన ఈ విశిష్ట ఆర్జిత సేవలను భక్తులందరూ సద్వినియోగం చేసుకుని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని ఆయన కోరారు.
