×
Ad

YS Jagan : ఆరేళ్ల తరువాత.. నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్.. భారీ భద్రత.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

YS Jagan : వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు.

YS Jagan

YS Jagan : వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. అక్రమాస్తుల కేసులో ఆరేళ్ల తరువాత జగన్ కోర్టుకు వస్తున్నారు. దీంతో నాంపల్లి సీబీఐ కోర్టు వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

గురువారం ఉదయం 9గంటలకు తాడేపల్లి నివాసం నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయలుదేరి గన్నవరం విమానాశ్రయం మీదుగా 10.45గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా 11.30గంటలకు నాంపల్లి సీబీఐ కోర్టుకు వెళ్లనున్నారు. కోర్టు విచారణ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 12.55గంటల సమయంలో లోటస్ పాండ్‌లోని తన నివాసానికి సీఎం జగన్ వెళ్లనున్నారు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటల వరకు బెంగళూరులోని తన నివాసానికి చేరుకునేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత కేవలం ఒక్కసారి మాత్రమే కోర్టుకు హాజరయ్యారు. 2020 జనవరి 10న నాంపల్లి సీబీఐ కోర్టుకు చివరిసారిగా ఆయన హాజరయ్యారు. అంటే దాదాపు ఆరేళ్ల తరువాత మళ్లీ అక్రమాస్తుల కేసులో విచారణలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి ఇవాళ కోర్టుకు హాజరు కానున్నారు.

పదకొండు కేసులకు సంబంధించి రోజువారిగా సీబీఐ కోర్టులో ట్రయిల్ సాగుతుంది. ఇటీవల కోర్టు అనుమతితో జగన్ లండన్ పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో కోర్టుకు తప్పుడు నెంబర్ ఇచ్చిన అంశంపై సీబీఐ కోర్టు సీరియస్ అయింది. అయితే, జగన్ లండన్ టూర్ నుంచి స్వదేశానికి వచ్చిన తరువాత హాజరుకావాలని కోర్టు ఆదేశించడంతో.. మినహాయింపు కావాలని పిటీషన్ దాఖలు చేశారు. వర్చువల్‌గా కోర్టుకు హాజరవుతానని జగన్ కోరారు. కానీ, దీనిపై సీబీఐ అభ్యంతరం తెలిపింది. ప్రస్తుతం ఈ కేసుల్లోని డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున నిందితులు భౌతికంగా హాజరుకావాల్సిందేనని సీబీఐ వాదించడంతో, న్యాయస్థానం జగన్ పిటిషన్‌ను తిరస్కరించింది. నవంబర్ 21లోగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. దీంతో గురువారం ఉదయం 11.30గంటలకు నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్ హాజరుకానున్నారు.

జగన్ నాంపల్లి కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో వైసీపీ అభిమానులు తరలివచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు..
♦ మాసబ్ ట్యాంక్, అల్ఫా కేఫ్ నుంచి నాంపల్లి క్రిమినల్ కోర్టుకు వచ్చే వాహనాలను మెయ్‌రోజ్ కేఫ్ వద్ద దర్గా-ఏక్ మినార్ -తాజ్ ఐస్లాండ్ వైపునకు డైవర్ట్ చేశారు.
♦ తాజ్ ఐస్లాండ్ , దర్గా నుంచి నాంపల్లి కోర్టుకు వచ్చే వాహనాలను మెయ్‌రోజ్ కేఫ్ వద్ద బజార్‌ఘాట్-గోకుల్‌నగర్ వైపునకు డైవర్ట్ చేశారు.
♦ లక్డీకపూల్ – రాయలసీమ రుచులు లైన్, ఎఫ్ఐటీసీసీఐ బిల్డింగ్ నుంచి వచ్చే వాహనాలను ఎఫ్ఐటీసీసీఐ మార్గ్ వద్ద న్యూ హిమాలయ కేఫ్ – బజార్‌ఘట్ వైపునకు డైవర్ట్ చేశారు.
♦ ఎంజే మార్కెట్ నుంచి తాజ్ ఐస్లాండ్ వైపునకు వచ్చే వాహనాలను ఏక్ మినార్, దర్గా, నాంపల్లికోర్టుకు వెళ్లాలనుకునే వాహనాలను తాజ్ ఐస్లాండ్ వద్ద నాంపల్లి మెట్రో స్టేషన్ – ఛాపెల్ రోడ్డు – అసెంబ్లీ మెట్రో స్టేషన్ వైపునకు అవసరం మేరకు మళ్లిస్తారు.
♦ మాసబ్ ట్యాంక్ – అల్‌సబ కేఫ్ -బజార్‌ఘాట్ నుంచి వచ్చే వాహనాలను బజార్ ఘాట్ చౌరస్తా వద్ద నీలోఫర్ కేఫ్ లైన్ – అయోధ్య జంక్షన్ – పీటీసీ బిల్డింగ్ వైపునకు డైవర్ట్ చేశారు.