తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై వైఎస్‌ షర్మిల దూకుడు

YS Sharmila’s efforts to form a political party : తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై వైఎస్‌ షర్మిల దూకుడు పెంచారు. రోజు వారీగా తన అనుచరులతో విస్తృతంగా చర్చలు జరుపుతున్న షర్మిల.. జిల్లాల పర్యటనకు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనిలో భాగంగానే ఈనెల 21న ఖమ్మం టూర్‌కు వెళ్లనున్నారు. ఆలోగా మిగిలిన జిల్లాల నేతలతో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా జిల్లాల వారీగా వైఎస్‌ అభిమానులు, అనుచరులతో సమావేశాలు జరుపుతున్నారు. మొన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలలో భేటీ అయిన షర్మిల.. తాజాగా ఖమ్మం జిల్లా వైఎస్‌ఆర్‌ అభిమానులతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు.

మూడు రోజులుగా ఆయా జిల్లాల నుంచి వస్తున్న నేతలను కలుస్తున్న షర్మిల.. ఈనెల 21న ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఆ జిల్లా నాయకులతో జరిపిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పోడు భూముల సమస్యే అజెండాగా వైఎస్‌ఆర్‌ అభిమానులతో ఆత్మీయ సమావేశం జరుపనున్నారు. ఆ రోజు హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌ నుంచి భారీ కాన్వాయ్‌తో ఖమ్మం వెళ్లేందుకు కార్యక్రమం రూపకల్పన జరుగుతోంది. ఆ జిల్లాకు చెందిన ముఖ్యనేత కొండా రాఘవరెడ్డి పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.

ఖమ్మం సమావేశానికి ఎవరెవరు హాజరవుతారన్న అంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై నిఘా వర్గాలు కూడా ఆరా తీస్తున్నాయి. జిల్లాలోని పార్టీలకు చెందిన కొందరు నేతలు షర్మిల వైపు చూస్తున్నట్టు సమాచారం. ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కొందరితో షర్మిల ఫోన్‌ చేసిన మాట్లాడినట్టు తెలుస్తోంది. షర్మిల పార్టీ పెడితే ఆయా పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలంతా చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వైసీపీలో చేరిన కొద్ది కాలానికే 2014లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయనకు ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. రాజకీయ సమీకరణాల్లో భాగంగా 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టికెట్‌ రాలేదు. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన నామా నాగేశ్వర్‌రావుకు సీటు ఇచ్చింది. అప్పట్లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌ లేదా బీజేపీలో చేరి లోక్‌సభకు పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. పార్టీ నాయకత్వం నచ్చచెప్పడంతో టీఆర్‌ఎస్‌లోనే ఉండిపోయారు. రాజ్యసభ సీటు ఇస్తారని టీఆర్‌ఎస్‌ నాయకత్వం హామీ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఉమ్మడి ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేశ్‌రెడ్డికి టికెట్‌ ఇచ్చినా.. పార్టీలోనే కొనసాగుతున్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి బీజేపీ నేతలు గాలం వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

పార్టీ ఏర్పాటు వ్యవహారాల్లో తలమునకలై ఉన్న షర్మిల పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కూడా ఫోన్‌ చేసినా.. ఆయన స్పందించలేదని సమాచారం. దీంతో పొగుంలేటిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న షర్మిల ఖమ్మం జిల్లాలో ప్రత్యామ్నాయ నేతల కోసం చూస్తున్నట్టు సమాచారం. 2014 ఎన్నికల్లో తెలంగాణలో వైసీపీకి ఖమ్మం జిల్లాలోనే మూడు అసెంబ్లీ సీట్లుతో పాటు, ఎంపీ సీటు వచ్చింది. ఆ తర్వాత అందరూ టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి కేటీఆర్‌ న్యాయం చేస్తారన్న నమ్మకంతో ఆయన ఉన్నారు. ఎంపీ నామా నాగేశ్వర్‌రావుతో కలిసి కొంత కాలం క్రితం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కేటీఆర్‌ను కలిసి అన్ని విషయాలను చర్చించారు. ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల ఎన్నికలు రాబోతున్న తరుణంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎంతో కీలకమని టీఆర్‌ఎస్‌ నాయకత్వం భావిస్తోంది.

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి లేకపోతే ఖమ్మంలో షర్మల పెట్టే పార్టీకి ఎవరు నాయకత్వం వహిస్తారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లోటస్‌ పాండ్‌లో షర్మిలతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. షర్మిల పార్టీ పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో ఆమెతో ఆళ్ల రామకృష్ణారెడ్డి సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఇద్దరూ పార్టీ వ్యవహారాలతో పాటు ఏపీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్టు సమాచారం.