వాటిపై యుద్ధం ప్రకటిస్తున్నాను.. ఎవరైనా అడ్డువస్తే తొక్కుకుంటూ పోవడమే: చంద్రబాబు

"నేను యువతకు ఒకటే చెబుతున్నా.. ఎన్నికలకు ముందు కూడా ఇదే విషయాన్ని చెప్పాను" అని చంద్రబాబు అన్నారు.

గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తున్నానని, ఎవరైనా అడ్డువస్తే తొక్కుకుంటూ పోవడమేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరులో యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడారు.

“నేను యువతకు ఒకటే చెబుతున్నా. ఎన్నికలకు ముందు కూడా చెప్పాను. గంజాయి, డ్రగ్స్ కు బానిస అయితే ఎంతో ప్రమాదం. డ్రగ్స్, గంజాయికి రాష్ట్రం కేంద్రంగా మారిందని టీడీపీ ఎన్నోసార్లు చెప్పింది. ఏజెన్సీని గంజాయికి అడ్డాగా మార్చారు. డ్రగ్స్, గంజాయికి రాష్ట్రం కేంద్రంగా మారిందని టీడీపీ ఎన్నోసార్లు చెప్పింది.

ఏజెన్సీని గంజాయికి అడ్డాగా మార్చారు. గంజాయి, డ్రగ్స్ పై యుద్ధం ప్రకటిస్తున్నాను. ఎవరైనా అడ్డువస్తే తొక్కుకుంటూ పోవడమే. పోలీసులపై దాడిచేసిన గంజాయి బ్యాచ్ కు సహకరిస్తే ఏమనాలి? వారిని వదిలిపెట్టాలా?

రాజకీయ ముసుగు వేసుకుంటే వదిలిపెట్టాలా? రాజకీయాలంటే తమాషా కాదు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత. గంజాయి వాడకంతో శక్తహీనులవుతారు. వారిని బాగు చెయ్యడం కష్టం. సమాజానికి, తల్లిదండ్రులకు సమస్యగా మారుతుంది. ఏజెన్సీలో గంజాయి పెంచకుండా కఠినమైన చర్యలు చేపట్టాం.

మామూలు షాపుల్లో గంజాయి అమ్ముతున్నారు. కొన్ని మెడికల్ షాపులలో గంజాయి అమ్ముతున్నారు. మారితే మారండి… లేకపోతే మీరు రాష్ట్రంలో ఉండడానికి అర్హతలేదు. 26 జిల్లాలలో నార్కొటిక్ సెల్స్ ఏర్పాటు చేశాం. కాలేజీలలో ఈగల్ క్లబ్బులు ఏర్పాటు చేశాం.

నేను గంజాయి నిర్మూలనకు కృషి చేస్తా, మీరు సహకరించండి. 1972కు కాల్ చెయ్యండి… మీ పేరు కూడా బయటకు రానివ్వం. 56డీ ఎడిక్షన్ సెంటర్లు పెడుతున్నాం. మూడు ప్రాంతాలలో వరల్డ్ క్లాస్ డీ ఎడిక్షన్ సెంటర్లు పెడతాం. డ్రగ్స్ నియాత్రణ కోసం సినిమావారికి కూడా చెబుతున్నా.. వారందరు ముందుకు రావాలి. రౌడీల తోక కత్తిరిస్తానని అన్నాను.

రాయలసీమలో ముఠా కక్షలు ఉండేవి. కుటుంబాలకు కుటుంబాలను చంపే పరిస్థితి ఉండేది. రాయలసీమలో ముఠాకక్షలను‌ పూర్తిగా అణిచివేశాం. మతసామరస్యాన్ని కాపాడుతాం… విద్వేషాలు రెచ్చగొట్టే వారిని వదిలిపెట్టం. రౌడీయిజాన్ని కంట్రోల్ చేశాం. పవన్ కల్యాణ్, బీజేపీతో కలిసి హామీ ఇచ్చాం. ప్రజలు ఎన్నికల్లో మాకు 94 శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చారు.

నా జీవితంలో ఇలాంటి విజయం చూడలేదు. రెండో ఏడాది ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టాం. అందరూ బాగుండాలి… ఆరోగ్యంగా ఉండాలి… అభివృద్ధి చెందాలి. విభజన‌ తర్వాత కొన్ని కష్టాలు వచ్చాయి. 2047కల్లా తెలుగుజాతి నెంబర్ వన్ గా ఉండాలన్నదే నా లక్ష్యం. విశాఖలో యోగా డే రోజున 23 ప్రపంచ అవార్డులు వచ్చాయి.. అదీ టీడీపీ అంటే” అని తెలిపారు.