పేరు “డాగ్ బాబు”.. తండ్రి పేరు “కుత్తా బాబు”.. కుక్కకు నివాస ధ్రువీకరణ పత్రం.. ఎలా వచ్చిదంటే?

ఈ సర్టిఫికేట్‌లో డాగ్ బాబు తల్లి పేరు “కుటియా దేవి”గా చూపించారు. కుటియా అంటే ఆడ కుక్క.

పేరు “డాగ్ బాబు”.. తండ్రి పేరు “కుత్తా బాబు”.. కుక్కకు నివాస ధ్రువీకరణ పత్రం.. ఎలా వచ్చిదంటే?

Updated On : July 29, 2025 / 3:38 PM IST

ఓ కుక్కకు నివాస ధ్రువీకరణ పత్రం వచ్చింది. పేరు “డాగ్ బాబు”.. తండ్రి పేరు “కుత్తా బాబు”గా అందులో ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. బిహార్‌ రాజధాని పాట్నాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంత నిర్లక్ష్యంగా కుక్కకు నివాస ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేశారు రెవెన్యూ ఆఫీసర్ మురారి చౌహాన్. ఆ సర్టిఫికెట్‌లో మురారి డిజిటల్ సంతకం కూడా ఉంది.

ఈ నివాస ధ్రువీకరణ పత్రాన్ని బిహార్ ఆర్టీపీఎస్ పోర్టల్ నుంచి మసౌరిజోన్ ఆఫీసు ద్వారా జారీ చేశారు. ఇందులో ఓ గోల్డెన్ రిట్రీవర్ ఫొటో ఉంది. పేరు “డాగ్ బాబు”గా ఉంది.

ఈ సర్టిఫికేట్‌లో డాగ్ బాబు తల్లి పేరు “కుటియా దేవి”గా చూపించారు. కుటియా అంటే ఆడ కుక్క. చిరునామా మోహల్లా కౌలిచక్, వార్డు నం 15, నగర్ పరిషత్ మసౌరిలో, జిల్లా పాట్నా, బిహార్‌గా ఉంది.

దరఖాస్తుదారు, కంప్యూటర్ ఆపరేటర్, ఈ సర్టిఫికేట్ జారీ చేసిన అధికారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పాట్నా జిల్లా యంత్రాంగం తెలిపింది. ఆ సర్టిఫికేట్‌ను రద్దు చేశామని, ఇది ఎలా జారీ అయిందన్న దానిపై విచారణ కొనసాగుతోందని వివరించింది.

డిజిటల్ సంతకం కోసం సురక్షితమైన ప్రభుత్వ డాంగిల్ వాడాల్సి ఉంటుంది. దాంతో ఇది ఎవరో చోరీ చేసి వాడి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

నవ్వుల్ నవ్వుల్‌
బిహార్ అధికారులు ఈ తప్పు ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, సోషల్ మీడియాలో ఆ నివాస ధ్రువీకరణ పత్రం వైరల్‌గా మారింది. ఒక ఎక్స్‌ యూజర్ స్పందిస్తూ.. “ఫన్నియస్ట్ ఫేక్ సర్టిఫికేట్” అన్నాడు.

“న్యూయార్క్ ఇప్పుడు కుక్కలను కుటుంబ సభ్యులుగా గుర్తించబోతోంది. మేమూ ప్రపంచంతో సమానంగా దూసుకుపోతున్నాం” అంటూ ఇంకొకరు చమత్కరించారు. “ఇటువంటివి బిహార్‌లోనే జరుగుతాయి” మరో యూజర్ కామెంట్ చేశాడు.