సోడాసీసాలతో మొదలుపెట్టిన దావూద్ ఇబ్రహీం.. డాన్‌గా ఎలా ఎదిగాడో తెలుసా?

సోడాసీసాలతో మొదలుపెట్టిన దావూద్ ఇబ్రహీం.. డాన్‌గా ఎలా ఎదిగాడో తెలుసా?

Updated On : August 25, 2020 / 11:42 AM IST

Dawood Ibrahim Life Story Secrets: పాకిస్తాన్ కు నిజాలు చెప్పే అలవాటు ఎప్పుడూ లేదు . ఒసామా బిన్ లాడెన్ కూడా పాకిస్తాన్ లో లేడనే చెప్పింది. దావూద్ గురించి కూడా అదే అబద్దం చెబుతూ వచ్చింది. ఎక్కడో మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో పుట్టి, ముంబైలో ఎదిగిన దావూద్ ఇబ్రహీం కస్కర్ కరాచీలో చక్రం ఎలా తిప్పుతున్నాడు? ముంబైలో బడాబడా మాఫియా డాన్‌లను ఎదిరించి దావూద్ ఎలా పైకొచ్చాడో తెలుసా?

దావూద్ పుట్టింది 1955, డిసెంబరు 27న మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో.. ఒక సాధారణ కానిస్టేబుల్ కుటుంబానికి చెందిన వ్యక్తి దావూద్. ముంబై మహా నగర నేర కేంద్రం డోంగ్రీలో 1974లో సృష్టించిన సంచలనంతో మొదటిసారిగా నేర సామ్రాజ్యంలో దావూద్ ఇబ్రహీం కస్కర్ పేరు మారుమోగింది. అప్పటికే ముంబై మాఫియాలో పేరున్న డాన్ పఠాన్ బాషు దాదా మీద దావూద్ సోడాసీసాలతో దాడి చేశాడు. తరువాత ముంబై మాఫియా లో ఉన్న బడాబడా డాన్ లు హాజీ మస్తాన్, వరదరాజన్ మొదలియార్, కరీంలాలా వంటి వారిని పక్కకు నెట్టేసి పైకొచ్చాడు.

1950లలో కేవలం కత్తిపోట్లకు పరిమితమైన ముంబై మాఫియా కార్యకలాపాలను అంతర్జాతీయ నేరాల స్థాయికి తీసుకువెళ్లాడు దావూద్. 1976లో అతడు ప్రారంభించిన ‘డి కంపెనీ’ పెద్ద పెద్ద నేరాలు చేసింది . 1982 నాటి ముంబై కార్మికుల సమ్మె నగరం స్వరూపాన్నే కాదు, మాఫియా ముఠాల విస్తృతిని కూడా ఊహకు అందనంతగా మార్చేసింది. డి కంపెనీ ఆయుధాల రవాణా, హవాలా, దొంగనోట్లు, మత్తు పదార్థాల రవాణా, బెదిరించి డబ్బు వసూలు చేయడం, కాంట్రాక్ట్ హత్యల వరకు విస్తరించింది.



బాలీవుడ్ సినిమాలకు కూడా దావూద్ పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టాడు. బాలీవుడ్ ప్రముఖులు అనేక మంది దుబాయ్ లో జరిగే దావూద్ బర్త్ డే పార్టీలకు హాజరైన వారే . అందుకే భరత్‌షా వంటి ప్రముఖులు అరెస్టయ్యారు. నటి మందాకినితో దావూద్ సంబంధం ఇంకా గాఢమైనది.

అయోధ్య పరిణామాల అనంతరం దావూద్ అనుచరుడు ఛోటా రాజన్ కొత్త కుంపటి పెట్టుకున్నాడు. అయోధ్య ఘటనలకు ప్రతీకారంగానే 1993 ముంబై వరస పేలుళ్లు జరిగాయి. దీంట్లో కీలక పాత్రధారి టైగర్ మెమన్, దావూద్ ముఖ్య అనుచరుడు. ఆ పేలుళ్ల సమయంలో నగరంలోనే కాదు దావూద్ మళ్లీ భారత్‌లో కనిపించలేదు. ముంబై పేలుళ్లతో ఇండియాలో ఉగ్రవాద కార్యకలాపాలకు తొలి అడుగు పడింది.



1993 మార్చ్ 12 వ తేదీ, శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటన్నర నుంచి మూడు గంటల నలభై నిమిషాల మధ్య మొత్తం 13 బాంబులు పేలాయి . ముంబై నగరం హాహాకారాలతో అట్టుడికింది. శివ సేన కార్యాలయం, బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్, ఎయిర్ ఇండియా బిల్డింగ్, సీరాక్ హోటల్, బాలీవుడ్ లెజెండ్ వీ శాంతారాంకు చెందిన ప్లాజా సినిమా, బిర్లాలకు చెందిన సెంచరీ బజార్… ఇవన్నీ పేలుళ్లలో దెబ్బతిన్నాయి . ఈ పేలుళ్లలో 257 మంది మృతి చెందారు వెయ్యి 400 మంది గాయపడ్డారు .

1993 ముంబై వరస పేలుళ్లు తర్వాత దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌కు పారిపోయాడు. అప్పటినుండి డి కంపెనీకి పాక్ కేంద్రమైంది. అల్ కాయిదా, లష్కరే తోయిబా వంటి మత ఛాందస సంస్థలతో దావూద్ బంధం అక్కడ నుంచే ప్రారంభమైంది. ఒసామా బిన్ లాడెన్‌తో దావూద్‌కు సాన్నిహిత్యం ఉందని అమెరికా బయటపెట్టింది. అఫ్ఘానిస్థాన్ నుంచి ఆల్‌కాయిదా సభ్యులు పారిపోవడానికి తన మాఫియా మార్గాలను దావూద్ చూపించాడు.



కరాచీలో దావూద్ ఉన్నాడని మొదటి నుంచి ఇండియా ఆరోపిస్తూనే ఉంది. దావూద్ భార్య, నలుగురు కుమార్తెలు, కుమారుడికి పాకిస్తాన్ పాస్‌పోర్టులు ఉన్నాయి. అయినా దావూద్ దేశంలో ఉన్నట్టు పాకిస్థాన్ ఏనాడూ అంగీకరించలేదు. కరాచీ కేంద్రంగా ఇతడు దక్షిణాసియా మొత్తం తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. మలేసియా, సింగపూర్, థాయ్‌లాండ్, శ్రీలంక, నేపాల్, దుబాయ్‌ లతోపాటు జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్‌లలో కూడా ఇతడి కార్యకలాపాలు విస్తరించాయి.

దావూద్ మాఫియా సామ్రాజ్యం విలువ 3 వేల కోట్ల రూపాయలకు పైనే. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలోనూ డి కంపెనీ పాత్ర ఉంది. 1976లో నుంచి ‘డి కంపెనీ’ పెద్ద పెద్ద నేరాలు చేసింది. 1982 నాటి ముంబై కార్మికుల సమ్మె నగర స్వరూపాన్నే మార్చేసింది. దావూద్ బర్త్ డే పార్టీలకు వెళ్లిన బాలీవుడ్ ప్రముఖులు, భరత్‌షా వంటి ప్రముఖులు అరెస్టయ్యారు. నటి మందాకినితో దావూద్ కు గాఢమైన సంబంధం ఉందనే వార్తలు ఉన్నాయి.