ఏపీలో వర్ష బీభత్సం.. వరద ముంపులో బెజవాడ.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు

ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాలు వరద ముంపులో ఉన్నాయి. వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు.

Budameru flood

AP Rains : ఏపీలో వర్షం దంచికొడుతుంది. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలదిగ్బందంలో చిక్కుకున్నాయి. భారీ వర్షానికి విజయవాడ, గుంటూరు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. బెజవాడ వరద ముంపులో చిక్కుకుంది. భారీ వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపైనా.. ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. బుడమేరు వాగు పొంగిపొర్లుతుంది. బుడమేరు ముంపుతో విజయవాడ నగరం అతలాకుతలం అవుతుంది. నగరంలోని 16 డివిజన్లను బుడమేరు ముంచెత్తింది. విద్యాధరపురం, పాలప్రాజెక్టు, చిట్టినగర్, రాజరాజేశ్వరి పేట, సింగ్ నగర్ లలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతుంది. ఆరు అడుగుల మేర రోడ్లపై నీరు నిలిచింది. పాయకాపురం, కండ్డ్రీక, రాజీవ్ నగర్ ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. అయితే, సహాయక చర్యలు సరిగా లేవంటూ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పునరావాస కేంద్రాలు కోసం ముంపు వాసులు ఎదురు చూస్తున్నారు.

Also Read : కళింగపట్నం సమీపంలో తీరందాటిన వాయుగుండం.. ఏపీలోని ఆ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు..

రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు..
ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాలు వరద ముంపులో ఉన్నాయి. వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. నూజివీడు పరిధిలో వరద నీటిలో చిక్కుకున్న 62మందిని రోప్ సాయంతో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం శాంతినగర్ కాలనీలోని 200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పరిటాల నూకన్ బ్లాక్స్ ఫ్యాక్టరీలో వరదలో చిక్కుకున్న 50 మంది కూలీలను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించారు. అదేవిధంగా రాయనపాడులో వరదలో చిక్కుకున్న పలువురిని రక్షించారు. టూటౌన్, జి కొండూరు, ఏఎస్ రావునగర్, నున్న, పెనుగంచిప్రోలులో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఆరు ప్రాంతాల్లో వరదలో చిక్కుకున్న 588 మందిని పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా రెండువేల మంది పోలీసు సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

Also Read : Chiranjeevi : తెలుగు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు.. ప్ర‌జ‌ల‌కు మెగాస్టార్ చిరంజీవి కీల‌క సూచ‌న‌..

ఎడతెరిపిలేని కుండపోత వర్షం కారణంగా.. గుడివాడ జాతీయ రహదారి 214పై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నందివాడ మండలం పుట్టగంట సమీపంలోని బుడమేరు పొంగి రోడ్లపైకి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. గుడివాడ, హనుమాన్ జంక్షన్ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డుకు ఇరువైపుల భారీకేడ్ లు ఏర్పాటుచేసి పోలీసులు వాహనాల నిలిపివేశారు. రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు