చిత్తుగా ఓడిన బెంగళూరు.. కోహ్లీకి కష్టాలు మొదలైనట్లేనా!!

చిత్తుగా ఓడిన బెంగళూరు.. కోహ్లీకి కష్టాలు మొదలైనట్లేనా!!

Updated On : September 24, 2020 / 11:21 PM IST

విరాటుడి పర్వం ఒక మ్యాచ్ తోనే ముగిసిందా అన్నట్లుంది. తొలి మ్యాచ్ విజయం తర్వాత గత సీజన్ ఫలితాలు తారుమారవుతాయని భావించారంతా. అదంతా ఆరంభశూరత్వమే అన్నట్లు మారింది. కెప్టెన్ కోహ్లీ(1)తో పాటు ఓపెనర్లు, డివిలియర్స్(28)ఆశించినంత మేర రాణించకపోవడంతో జట్టు కుదేలైంది. మూడు ఓవర్లు మిగిలి ఉండగానే ఆల్ అవుట్ గా చిత్తు అయి 97 పరుగుల తేడాతో పరాజయం మూటగట్టుకుంది.

కోహ్లీకి అనూహ్య రీతిలో షాక్ ఇచ్చింది పంజాబ్. కేవలం 3వికెట్లు మాత్రమే కోల్పోయి బెంగళూరుకు 207 పరుగుల టార్గెట్ ఇచ్చి సవాల్ విసిరింది. కింగ్స్‌ పంజాబ్‌ ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌ చెలరేగిపోయాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఫెయిలైన రాహుల్‌.. ఆర్సీబీ మ్యాచ్‌లో మాత్రం రెచ్చిపోయాడు. బంతిని బౌండరీలు దాటించడమే లక్ష్యంగా ఆడాడు.



కేఎల్ రాహుల్ సెంచరీ:

36 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత రెట్టింపు ఉత్సాహంతో బాదుడు మొదలుపెట్టాడు. అవతలి ఎండ్‌ నుంచి సరైన సపోర్ట్‌ లేకపోయినా రాహుల్‌ మాత్రం రెచ్చిపోయాడు. ప్రధానంగా స్లాగ్‌ ఓవర్లలో రాహుల్‌ బ్యాట్‌ ఝుళిపించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌ 2020లో తొలి సెంచరీని నమోదు చేశాడు రాహుల్‌.

రెండు క్యాచ్‌లను బెంగళూరు కెప్టెన్ కోహ్లి వదిలేయడంతో లైఫ్ దొరికింది. దొరికిన అవకాశాన్ని చక్కగా వాడేసుకున్న రాహుల్ సెంచరీతో మెరిశాడు. 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా కింగ్స్‌ పంజాబ్‌ మూడు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది.

ఇన్నింగ్స్ ముగిసేవరకూ క్రీజులో పాతుకుపోవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 170పరుగులకే కట్టడి చేయాలని భావించిన కోహ్లీకి షాక్ తగిలినట్లు అయింది. టాస్‌ గెలిచిన ఆర్సీబీ ముందు ఫీల్డింగ్‌ తీసుకోవడంతో కింగ్స్‌ పంజాబ్‌ బ్యాటింగ్‌కు దిగింది.