కలగానే మిగిలిపోయిన వేణుమాధవ్ ఎమ్మెల్యే కోరిక

కలగానే మిగిలిపోయిన వేణుమాధవ్ ఎమ్మెల్యే కోరిక

Updated On : September 25, 2019 / 9:55 AM IST

వేణుమాధవ్ జీవితంలో ఎమ్మెల్యే కావాలనే కోరిక అలానే మిగిలిపోయింది. స్వతహాగా నాయకునిగా కనిపించే వేణు మాధవ్ ఆపద అంటూ వచ్చిన వారికి తోచిన సాయం చేస్తూనే ఉండేవారు. పైగా ఆయన కెరీర్ పుంజుకుంది కూడా పొలిటికల్ స్టేజిపైనే. చదువుకునే రోజుల్లో మిమిక్రీ చేసే వేణుమాధవ్‌ అప్పటి కోదాడ ఎమ్మెల్యే చందర్ రావు కంట్లో పడ్డారు. వెంట్రిలాక్విజమ్ ప్రోగ్రామ్ చూసి భువనగిరిలో జరుగుతున్న టీడీపీ సమావేశానికి తీసుకెళ్లారు. దానికి చక్కటి స్పందన రావడంతో ఎన్టీఆర్ మహానాడులోనూ ప్రదర్శన ఇచ్చారు. 

ఎన్టీఆర్‌కు ఆయన ప్రదర్శన మెచ్చి ‘మీ సేవలు మాకెంతో అవసరం బ్రదర్’ అంటూ తొలి ఉద్యోగం ఇచ్చారు. అలా మిమిక్రీ ఆర్టిస్టుగా వచ్చిన ఆయన  సినిమాలు చేస్తూనే టీడీపీ తరపున ప్రచారంలోనూ పాల్గొనేవారు. ఆ తర్వాత సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలోనూ సభలు, సమావేశాలు, జన్మభూమి లాంటి ఎన్నో ప్రచార కార్యక్రమాల్లో వేణుమాధవ్ బిజీగా మారిపోయారు.

అదే సమయంలో వచ్చిన సినిమా అవకాశాలను కూడా అందిపుచ్చుకున్నారు. సినిమాలు చేస్తూనే రాజకీయ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రచారానికి వేణుమాధవ్ ను తీసుకెళ్లేవారు టీడీపీ అభ్యర్థులు. ఎమ్మెల్యేగా తాను కన్న కలను నిజం చేసుకోవాలని 2014లో కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. చివరి నిమిషంలో పార్టీ టికెట్ నిరాకరించింది.

అలాంటి సమయంలోనూ టీడీపీని వీడలేదు. పార్టీ సీట్ ఇచ్చిన అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. 2017లో నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ టీడీపీ తరపున ప్రచారం చేశారు. ఎమ్మెల్యే కావాలనే తన కోరిక అని చాలాసార్లు బయటపెట్టారు. వేణుమాధవ్ ఎమ్మెల్యే కోరిక నెరవేరకుండానే తుది శ్వాస విడవడం బాధాకరం.