ఏపీ సీఎస్ ఎల్వీ ఉద్వేగ ప్రసంగం : సహనం కోల్పోతే ఉద్యోగం పోతుంది

  • Published By: veegamteam ,Published On : April 20, 2019 / 05:57 AM IST
ఏపీ సీఎస్ ఎల్వీ ఉద్వేగ ప్రసంగం : సహనం కోల్పోతే ఉద్యోగం పోతుంది

Updated On : April 20, 2019 / 5:57 AM IST

ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల్లో అనుభవం కనిపించింది. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఏపీ సెక్రటేరియట్ లోని IAS వేడుక జరిగింది. ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన ఉపన్యాసం, చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

ప్రభుత్వంలో పని చేసే IASలు అందరూ ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని సూచించారాయన. సహనం అన్నింటి కంటే ముఖ్యం అన్నారు. నిర్ణయాలు తీసుకునే సమయంలో ఒత్తిడిని అధిగమించాలని కోరారు. నిజాయతీతో వ్యవహరించాలని సూచనలు చేశారాయన. సివిల్ సర్వీస్ ఉద్యోగం అంటే క్రికెట్ మ్యాచ్ లాంటిది.. ఒక్క బాల్ సరిగ్గా ఆడకపోయినా ఔట్ కావాల్సిందే అని చెబుతూనే.. లాంగ్ టర్మ్ గేమ్ గా అభివర్ణించారాయన. అందరి హోదా ఒకటే అని.. అది బ్లాక్ 1, బ్లాక్ 2లో ఉద్యోగం చేసినా ఒకటే అంటూ క్యాడర్ లోని ఆంతర్యాలను విశ్లేషించారు ఎల్వీ సుబ్రహ్మణ్యం.

అధికార, ప్రతిపక్ష పార్టీలు అయినా, ఇంకెవరు అయినా రెచ్చగొడతారని.. అలాంటి సమయం సహనంతో ఉండాల్సిన అవసరం మనదే అన్నారు. రెచ్చగొడితే రెచ్చిపోవద్దని.. ఓపిగ్గా ఉన్నప్పుడే వివాదాలకు దూరంగా ఉండగలం అని సూచించారు సహ ఉద్యోగులకు. సహనం కోల్పోతే ఉద్యోగం కోల్పోతామని ఉదాహరణలతో సహా వివరించారాయన. రెచ్చగొడితే రెచ్చిపోయి వ్యాఖ్యలు చేయటం వల్ల ఉద్యోగం కోల్పోయిన అధికారులు తనకు తెలుసు అంటూ తన అనుభవాలను వివరించారు సీఎస్. నిజాయతీ, హుందాగా వ్యవహరించినప్పుడే బాధ్యత కూడా పెరుగుతుందని.. అప్పుడే రోల్ మోడల్ గా ఉంటామన్నారు. సమాజానికి IAS అధికారులు రోల్ మోడల్ గా ఉండాల్సిన బాధ్యత చీఫ్ సెక్రటరీగా తనపైనా ఉందన్నారు ఎల్వీ సుబ్రహ్మణ్యం. సీఎస్ చేసిన ఉద్వేగభరిత ప్రసంగం చర్చనీయాంశం అయ్యింది.