బోటు ప్రమాదం : దేవీపట్నం వెళ్లనున్న సీఎం జగన్

  • Published By: veegamteam ,Published On : September 15, 2019 / 03:12 PM IST
బోటు ప్రమాదం : దేవీపట్నం వెళ్లనున్న సీఎం జగన్

Updated On : September 15, 2019 / 3:12 PM IST

బోటు ప్రమాదం జరిగిన తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నానికి సోమవారం (సెప్టెంబర్ 16, 2019) సీఎం జగన్ వెళ్లనున్నారు. ఉదయం 11 గంటల సమయంలో జగన్ తాడేపల్లిగూడెం నుంచి బయల్దేరి దేవీపట్నం వెళ్లనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లనున్నారు. బోటు ప్రమాద ప్రాంతాన్ని ఆయన పరిశీలించనున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. అలాగే బాధిత కుటుంబాలను సీఎం జగన్ పరామర్శించనున్నారు. రంపచోడవరం ఆస్పత్రితో చికిత్స పొందుతున్న వారిని కలిసి ప్రమాదానికి గల కారణాలను  తెలుసుకోనున్నారు. రేపు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండటంతో సీఎం అక్కడే ఉండి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించనున్నారు. 

ఇప్పటికే సీఎం జగన్ మృతుల కుటంబాలకు రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రమాద ఘటనపై అధికారులతో సీఎం జగన్ మాట్లాడారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యల వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఘటనా స్థలానికి దగ్గరలో ఉన్న మంత్రులు వెళ్లాలని ఆదేశించారు. సహాయక చర్యలపై డీజీపీ, జిల్లా ఎస్పీతో మాట్లాడి ఎప్పటికప్పుడు ఘటనపై సమాచారం ఇవ్వాలని జగన్ అధికారులను ఆదేశించారు. 

బోటు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. 24మంది సురక్షితంగా బయటపడగా, గల్లంతైన వారికి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బోటులో అందులో 71 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 61 మంది పర్యాటకులు, 10 సిబ్బంది ఉన్నారు. వీరిలో 14 మంది హైదరాబాద్ వాసులు, 17 మంది వరంగల్ వాసులు, విశాఖ, రాజమహేంద్రవరానికి చెందిన 30 మంది, విజయవాడకు చెందిన ముగ్గురు ఉన్నట్లు గుర్తించారు. 

కచ్చులూరు దగ్గర గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రమాదం జరిగింది. వెనక్కి తీస్తుండగా రాయికి తగిలి బోటు తిరగబడినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రమాదానికి గురైన రాయల్‌ వశిష్ట బోటును ప్రయివేట్‌ వ్యక్తి నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. కోడిగుడ్ల వెంకట రమణ అనే వ్యక్తి ఈ బోటును తిప‍్పుతుండగా బోటుకు అనుమతులు లేనట్లుగా అధికారులు చెబుతున్నారు.

Also Read : భోజనాలు చేయడం కోసం లైఫ్ జాకెట్ల తొలగింపు : పెరిగిన మృతుల సంఖ్య