కరోనా కంటే కఠినాత్ముడు ఈ తల్లి కన్నకొడుకు..నడిరోడ్డుపై వదిలేసి పోయాడు

  • Published By: nagamani ,Published On : July 25, 2020 / 02:56 PM IST
కరోనా కంటే కఠినాత్ముడు ఈ తల్లి కన్నకొడుకు..నడిరోడ్డుపై వదిలేసి పోయాడు

Updated On : July 25, 2020 / 3:09 PM IST

కరోనా వచ్చిన కన్నతల్లి కోసం తల్లడిల్లిపోయిన ఓకొడుకు తల్లిని చూసుకునేందుకు ఐసీయూ వార్డు గోడ ఎక్కి తల్లిని చూసుకుంటూ కుమిలిపోయిన కొడుకు గురించి విన్నాం. కానీ హైదరాబాద్ లోని ఓ కొడుకు మాత్రం మానవత్వం లేని మనిషని నిరూపించుకున్నాడు. కరోనా సోకి చికిత్స పొంది ఇంటికి వచ్చిన తల్లిని ఇంట్లోకి రానివ్వలేదు ఆ కొడుకు. రోడ్డు మీదకు గెంటేశాడు ఆ కసాయి కొడుకు. దీంతో ఎటువెళ్లాలో..ఎలా బతకాలతో దిక్కు తోచక నడిరోడ్డుమీదనే కాలం గడుపుతోంది ఆ తల్లి. హైదరాబాద్ ఫిలింనగర్‌లోని శుక్రవారం (జులై 24,2020) రాత్రి ఈ అమానవీయ ఘటన జరిగింది.

బీజేఆర్‌ నగర్‌కు చెందిన 55 ఏళ్ల మహిళకు కరోనా సోకింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకొంది. ఆమెకు మరోసారి పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చిందని నిర్థారించిన డాక్టర్లు ఇక నీవు ఇంటికి వెళ్లిపోవచ్చమ్మా..కానీ జాగ్రత్తగా ఉండు అని చెప్పి డిశ్చార్జ్ చేశారు. దీంతో ఆస్పత్రిలో ఎన్నో రోజుల పాటు కరోనా భయం గుప్పిట్లో బతికిన ఆ తల్లి ఎంతో సంతోషంగా ఫిలింనగర్‌లో ఉన్న కొడుకు దగ్గరకు వచ్చింది.

కానీ ఆమె కొడుకు తల్లిని ఇంట్లోకి రానివ్వలేదు. ఈ రాత్రి సమయంలో ఎక్కడికి వెళతానురా..అంటూ దీనంగా వేడుకుంది. కానీ కొడుకు, కోడలు ఇంట్లోకి రానివ్వలేదు. తాముఅక్కడే ఉంటే ఇంట్లోకి వచ్చేస్తుందేమోనని ఆమెను అక్కడే నిర్ధాక్షిణ్యంగా వదిలేసి ఇంటికి తాళం వేసుకొని బంధువుల ఇంటికి వెళ్లిపోయారు.

దీంతో ఆమె దిక్కు తోచక నిస్సహాయ స్థితిలో అర్థరాత్రి సమయంలో తెల్లవారే వరకూ ఇంటి బయటే నడిరోడ్డుమీద ఉండాల్సి వచ్చింది. దీంతో ఏం చేయాలో పాలుపోక పోలీసులకు విషయం చెప్పి తనకు న్యాయం చేయాలని కోరింది. దీంతో పోలీసులు ఆమె కొడుకుతో మాట్లాడతామని నచ్చచెప్పారు. ఇటువంటి ఘటనలు ఈ కరోనా కాలంలో ఎన్నో..ఎన్నెన్నో జరుగుతున్నాయి. బంధాలకు కరోనా కష్టాలు ప్రశ్నిస్తున్నాయి. పరీక్షలు పెడుతున్నాయి. అనవసర భయంతో తోటివారిపై వివక్ష చూపుతూనే ఉన్నారు. ఇలాంటి చర్యలు తప్పు అని ప్రభుత్వాలు చెబుతున్నా చాలా మందిలో మార్పు రావడం లేదు.