శాసనమండలిలో లోకేష్ వర్సెస్ మంత్రి వెల్లంపల్లి: తిరుమలలో అన్యమత ప్రచారంపై రచ్చ

తిరుమలలో అన్యమత ప్రచారంలో నారా లోకేశ్ హస్తం ఉందని మంత్రి వెల్లంపల్లి ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రదేశంలో అన్యమత ప్రచారంపై శాసన మండలిలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి లోకేశ్ పై ఆరోపణలు చేస్తు తిరుమలలో అన్యమత ప్రచారంపై లోకేశ్ హస్తం ఉందని..లోకేశ్ టీడీపీ సభ్యులతో సోషల్ మీడియా ద్వారా అన్యమత ప్రచారం చేయిస్తూ..ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని అనుకుంటున్నారని అన్నారు.
తిరుమల కొండపై ఏసు క్రీస్తు శిలువ అనేది సోషల్ మీడియాలో చేసిన క్రియేటివిటీ మాత్రమేనని మంత్రి కొట్టిపారేశారు. సోషల్ మీడియా ద్వారా మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు టీడీపీ యత్నిస్తోందని..తిరుమల కొండపై శిలువ ఉందని నిరూపిస్తే తాను తక్షణం రాజీనామా చేస్తానని..శిలువ లేకుంటే లోకేశ్ రాజీనామా చేయాలని వెల్లంపల్లి డిమాండ్ చేశారు. వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు చేయవద్దనీ.. చేస్తే నష్టపోయేది వారేనని మంత్రి వెల్లంపల్లి సూచించారు.
ఈ ఆరోపణలపై లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి వెల్లంపల్లి చేసిన ఆరోపణల్ని నిరూపించాలని డిమాండ్ చేశారు. వట్టిగా ఆరోపణలు చేయటం కాదు..నిరూపించి అప్పుడు మాట్లాడాలని డిమాండ్ చేశారు.
ఇలా తిరుమలలో అన్యమత ప్రచారంపై అధికార ప్రతిపక్షాల మధ్య శాసనమండలిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు విమర్శలు..ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు.