మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి…అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు పైడికొండల మాణిక్యాలరావు మృతి చెందారు.1961లో తాడేపల్లిగూడెంలో ఆయన జన్మించారు. ఫొటో గ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించి మంత్రిగా ఎదిగారు. ఆయన స్వతహ స్వయంసేవక్ గా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో చురుకుగా పనిచేశారు. 1989లో బీజేపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షులుగా పార్టీకి పలు సేవలు అందించారు.
తొలిసారి తాడేపల్లిగూడెం బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 శాసనసభకు ఎన్నికైన మాణిక్యాలరావు టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి గా పని చేశారు. 2018లో పార్టీ సంస్థాగత ఎన్నికల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి గా కొనసాగుతున్నారు.
మాణిక్యాలరావు మృతిపట్ల ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. మాజీ మంత్రికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీ చేశారు.
మాణిక్యాలరావు మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని నష్టం అన్నారు. ఆయన కుటుంభ సబ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.