స్నేహం కోసం : ‘ఫ్లాష్ మాబ్’

ఫ్రెండ్ దివ్యకు జీబీ సిండ్రోమ్ వ్యాధి
స్నేహితురాల్ని బ్రతికించుకోవటానికి వినూత్న ప్రదర్శన
మద్దిలపాలెం సీఎంఆర్ సెంట్రల్‌లో ఫ్లాష్ మాబ్
మేము సైతం అన్న కేరాఫ్ కంచరపాలెం సినిమా నటులు
విశాఖ : అరుదైన వ్యాధితో మృత్యువుతో పోరాడుతున్న దివ్యను బతికించుకోనేందుకు ఆమె స్నేహితులు వినూత్న రీతిలో వివిధ కార్యక్రమాలు చేపడుతూ విరాళాలు సేరిస్తున్నారు. దీంట్లోభాగంగా విశాఖలోని మద్దిలపాలెం సీఎంఆర్ సెంట్రల్‌లో ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేరాఫ్ కంచరపాలెం సినిమా నటులు సైతం బాసటగా నిలిచారు.
నెల రోజులుగా దివ్య జీబీ సిండ్రోమ్ అనే వ్యాధి సోకి విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చికిత్సకు 45 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఆమె స్నేహితులు నడుం బిగించారు. ఇప్పటికే 10 లక్షల రుపాయలు విరాళాల రూపంలో సేకరించారు. సీఎం రిలీఫ్ పండ్ కింద మరో 10 లక్షలు మంజూరయ్యాయి. ఇంకా 25 లక్షల వరకు అవసరం ఉంది. దీంతో దివ్య స్నేహితులు వినూత్న రీతిలో విరాళాలు సేకరిస్తున్నారు. విశాఖలోని సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో ఫ్లాష్ మాబ్ నిర్వహించి.. సేవ్ దివ్య అంటూ ప్రచారం చేశారు.
పాతిక రోజుల క్రితం చలాకీగా ఇంట్లో తిరిగిన దివ్య ఇప్పుడు కదలలేని స్థితిలో మంచానికే పరిమితవడం చూసి ఆమె తల్లి తల్లడిల్లిపోతోంది. స్నేహితులు, బంధువులు అంతా కన్నీరుమున్నీరవుతున్నారు. ఎలాగైనా దివ్యను బతికించాలని ప్రాధేయపడుతున్నారు.మరోవైపు మానవతా దృక్పథంతో తోచినంత సాయం అందించాలని కేరాఫ్ కంచరపాలెం సినిమా నటులు కోరుతున్నారు. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా 7842473149 అనే నంబర్‌కు దాతలు ముందుకు వచ్చి ఆర్థిక చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. దివ్య త్వరగా కోలుకోవాలని.. క్షేమంగా తిరిగిరావాలని అందరూ భగవంతుడిని వేడుకుంటున్నారు. మనసున్న ప్రతి ఒక్కరూ స్పందిస్తే.. దివ్య మళ్లీ మామూలుగా మనిషిగా మారుతుందని కోరుతున్నారు.