ప్రాణదాత:గుండెపోటు వచ్చినా 52మంది ప్రాణాలు కాపాడిన డ్రైవర్

  • Published By: veegamteam ,Published On : January 24, 2019 / 02:40 AM IST
ప్రాణదాత:గుండెపోటు వచ్చినా 52మంది ప్రాణాలు కాపాడిన డ్రైవర్

Updated On : January 24, 2019 / 2:40 AM IST

కరీంనగర్ : ప్రాణాపాయంలోనూ ఓ ఆర్టీసీ డ్రైవర్‌ బాధ్యత మరువలేదు. గుండెనొప్పి బాధిస్తున్నా ప్రయాణికుల రక్షణకే ప్రాధాన్యం ఇచ్చాడు. ప్రాణాపాయంలోనూ బాధ్యతాయుతంగా వ్యవహరించి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ఒకవైపు గుండెపోటు బాధిస్తున్నా ప్రయాణికులు క్షేమండా ఉండాలనే తలంపుతో క్షేమంగా బస్సును రోడ్డు పక్కకు దించాడు. ఆ తర్వాత తీవ్రమైన నొప్పితో విలవిల్లాడుతూ స్టీరింగ్‌పైనే కుప్పకూలిపోయాడు. గుండెపోటు వచ్చినా సమయస్ఫూర్తితో వ్యవహరించి 52 మంది ప్రాణాలు కాపాడాడు.

గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సు బుధవారం ఉదయం 5.15 గంటలకు వయా యైటింక్లయిన్‌కాలనీ మీదుగా పెద్దపల్లి నుంచి హైదరాబాద్‌ బయలుదేరింది. బస్సులో 52 మంది ప్రయాణికులున్నారు. 6.35 గంటల సమయంలో రాఘవాపూర్‌ సమీపంలో డ్రైవర్‌ మహేందర్‌ (45) ఛాతీలో నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఆ సమయంలో బస్సు వేగం గంటకు 60 కిలోమీటర్లుగా ఉంది. ఓ వైపు నొప్పి బాధిస్తున్నా బస్సును నియంత్రించి రోడ్డు పక్కన ఆపి.. స్టీరింగ్‌ పైనే కుప్పకూలాడు. దీన్ని గమనించిన ప్రయాణికులు 108కు ఫోన్‌ చేసినా.. అది ఆలస్యమయ్యేట్లు కనిపించింది.

 

డ్రైవర్‌ విషమ పరిస్థితి గమనించిన బస్సులో ప్రయాణిస్తున్న సింగరేణి ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. ఓసీపీ 3లో పనిచేస్తున్న ఎంవీ డ్రైవర్‌ వెంకటరమణ, ఈపీ ఆపరేటర్‌ ఆకుల రాజయ్యలు.. మహేందర్‌కు ప్రథమ చికిత్స అందించారు. ఓసీపీ 1లో ఈపీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న తిరుపతి బస్సును నడుపుకుంటూ 10 నిమిషాల్లో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. మహేందర్‌ను పరీక్షించిన వైద్యులు.. గుండెపోటుగా నిర్ధారించి వైద్యం అందించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు. సరైన సమయంలో ప్రాథమిక చికిత్స అందడంతో.. డ్రైవర్‌ మహేందర్‌కు ప్రాణాపాయం తప్పింది. తన ప్రాణాన్ని లెక్కచేయక మహేందర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించి 52 ప్రాణాలు కాపాడారు.