అనాథగా పూర్తయిన పూజారి అంత్యక్రియలు.. ఆ తర్వాత ఇంట్లో చూస్తే డబ్బు మూటలు

ఆయనో పేద పురోహితుడు.. 30ఏళ్ల పాటు పౌరోహిత్యం చేసి మంగళవారం(27 ఆగస్ట్ 2019) తుదిశ్వాస విడిచాడు. అయితే ఆయనను చివరి చూపు చూసేందుకు కూడా ఎవరూ రాలేదు. ఆయన బంధువులు, పిల్లలు.. ఎవరూ కూడా అందుబాటులోకి రాకపోవడంతో చివరకు స్థానికులే పురోహితుడి మృతదేహాన్ని బంధువులకు సమాచారం అందించి అంత్యక్రియలను పూర్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలోని ముక్తిలింగయ్యగారి వీధిలో ఉండే అప్పల సుబ్రహ్మణ్యం(70) ఓ పేద బ్రహ్మణుడు. స్థానిక గుడిలో పురోహితుడిగా పని చేస్తూ.. అనారోగ్యంతో చనిపోయారు. అయితే బంధువులు ఎవరు రాకపోవడంతో అతని మృతదేహాన్ని స్థానికులే ఖననం చేశారు. అయితే ఖననం చేసిన అనంతరం సుబ్రహ్మణ్యం చాలాకాలంగా ఉంటున్న పాడుపడ్డ ఇంటిలోకి వెళ్లి చూడగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ అనేక డబ్బు మూటలు కనిపించడంతో స్థానికులు నోళ్లు వెల్లబెట్టుకున్నారు.
వాటిల్లో భారీగా డబ్బులు ఉండటంతో ముక్కున వేలేసుకున్నారు. మూటలు విప్పి లెక్కించడం ప్రారంభించారు. ఎంతకీ లెక్క తేలకపోవడంతో కౌంటింగ్ మిషన్ ను ఉపయోగించి లెక్కించటం మొదలుపెట్టారు. బుధవారం(28 ఆగస్ట్ 2019) రాత్రి 9గంటల వరకు రూ.6లక్షలు మాత్రమే లెక్కించగలిగారు. మిగిలి మూటల్లోని డబ్బులు లెక్కించవలసి ఉంది. ఎక్కువగా రూ.10నోట్లు, చిల్లర ఉండడంతో లెక్కించడం కష్టం అయ్యింది.