మెగా బ్రదర్స్ గట్టెక్కేనా : వెస్ట్ గోదావరి ఎందుకు ?

పశ్చిమ గోదావరి జిల్లానే మెగా బ్రదర్స్ ఎందుకు ఎంచుకున్నారు? కాపు ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నారా? మెగా ఫ్యాన్స్ అండగా నిలుస్తారని ఆశించారా? నాగబాబు రాకతో నర్సాపురం నియోజకవర్గంలో త్రిముఖ పోటీ తప్పదా? కాపు సామాజికవర్గం ఓటర్లు అంతా ఐక్యంగా నాగబాబుకు మద్దతిస్తారా? టీడీపీ, వైసీపీ మధ్య ఇతర ఓటర్లు చీలిపోయి తమకు కలిసొస్తుందన్న జనసేన అంచనాలు నిజమవుతాయా? తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన జనసేనాని.. ఏరికోరి కాపుల ఓట్లు గణనీయంగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ స్థానాలనే ఎంపిక చేసుకున్నారు. 13 జిల్లాలున్న నవ్యాంధ్రలో ఒకేసారి రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించడం ఓ విచిత్రమైతే.. విశాఖ, ఆ పక్కనే ఉండే గోదావరి జిల్లాల నుంచే రెండు స్థానాలను ఎంపిక చేసుకోవడం విశేషం.
Read Also : జగన్ టికెట్లు అమ్ముకున్నారు – హర్షకుమార్
వాస్తవానికి పవన్ ఇచ్ఛాపురం, అనంతపురం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. ఆయా స్థానాల్లో పార్టీ బలంగా ఉన్నా.. శ్రేణుల సన్నద్ధతకు సమయం సరిపోదని కార్యవర్గం అభిప్రాయపడింది. తిరుపతి స్థానం చర్చకు వచ్చింది. ప్రజారాజ్యం తరుపున చిరంజీవి పోటీ చేసి గెలుపొందారని మళ్లీ తాను నిలిస్తే అది మెగా కుటుంబ స్థానంగా ముద్ర పడుతుందేమోనని పవన్ భావించారు. గాజువాక, భీమవరం స్థానాల నుంచి బరిలోకి దిగడం ఉత్తమమని జనసేనాని భావించారు. భీమవరంలో పోటీ చేస్తే అన్ని ప్రాంతాల్లో పార్టీకి సానుకూల ప్రభావాన్ని తీసుకువస్తుందని జనసేన కార్యవర్గం విశ్లేషించింది.
గాజువాక ప్రాంతం స్టీల్ ప్లాంట్, ఇతర పరిశ్రమలతో అభివృద్ధి చెందిందని చెబుతున్నా భూములు ఇచ్చిన రైతులకు నేటికి పరిహారం దక్కని విషయం తాను పోరాట యాత్రలో గ్రహించానని పవన్ గుర్తు చేస్తున్నారు. భీమవరంతో తనకు అనుబంధం ఉందని పవన్ చెప్తున్నారు. భీమవరం అభివృద్ధి చెందిన ప్రాంతంగా కన్పించినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయనే విషయంపై తనకు అవగాహన ఉందన్నారు.భీమవరం డంపింగ్ యార్డ్ సమస్య ప్రజాప్రతినిధుల చెవికెక్కలేదని ఆక్షేపించారు.
నాగబాబు :
పవన్ సోదరుడు నాగబాబు సైతం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచే ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. పవన్, నాగబాబు గెలుపు కోసం చంద్రబాబుతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని ప్రతిపక్ష వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. మెగా బ్రదర్స్ ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల్లో వారికి అనుకూలంగా టీడీపీ వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా మాజీమంత్రి, సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడును పోటీ చేయించాలని చంద్రబాబు మొదట భావించారు. కాపు సామాజికవర్గానికి చెందిన కొత్తపల్లి సుబ్బారాయుడు ఎంపీగా పోటీ చేస్తే నాగబాబుకు రాజకీయంగా సమస్య ఎదురవుతుందనే భావన నెలకొంది. దీంతో చైతన్యరాజును ఎంపీ అభ్యర్థిగా సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆయన టీడీపీ అభ్యర్థిగా ఉండటాన్ని కూడా పవన్ కల్యాణ్ వ్యతిరేకించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఉండి ఎమ్మెల్యేగా ప్రకటించిన వేటుకూరి శివ రామరాజును నరసాపురం ఎంపీగా చంద్రబాబు ప్రకటించారు.
నాగబాబును నరసాపురానికి ఎంపిక చేయడానికి మరో కారణం కూడా ఉంది. పవన్ పోటీ చేస్తున్న భీమవరం కూడా ఈ లోక్‌సభ పరిధిలోకే వస్తుంది. దీంతో తన ఫాలోయింగ్ కూడా అన్న విజయానికి తోడ్పడుతుందని పవన్ భావించారు. మెగా బ్రదర్స్ పశ్చిమ గోదావరి జిల్లానే ఎంపిక చేసుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. అందులో ఒకటి కాపు కమ్యూనిటీ, రెండు ఫ్యాన్స్. జిల్లాలో కాపు ఓటు బ్యాంకు పెద్ద సంఖ్యలో ఉండడంతో తమకు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. కాపు ఓటర్ల తర్వాత బీసీ, క్షత్రియ సామాజిక వర్గాల ఓటర్లు ఎక్కువ. భీమవరంలో కాపు ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. అక్కడ 2004 నుంచి వరుసగా కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. భీమవరంలో పవన్ కల్యాణ్‌కు కొండంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అది కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. మొత్తానికి కాపులు, అభిమానులు మెగా బ్రదర్స్‌ను గట్టెక్కిస్తారో లేదో చూడాలి.
Read Also : తెలంగాణ BJP కి కొత్త రెక్కలు : సౌత్‌లో పాగా వేస్తుందా