అన్నం, పప్పుచారు, గుడ్డు కూర: మధ్యాహ్న భోజనం కోసం రూ.200కోట్లు

ఇటీవల అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా.. జగన్ మోహన్ రెడ్డి స్కూళ్లలో మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం పథకంలోని కొత్త మెనూ కోసం రూ. 200 కోట్లను విడుదల చేసింది ప్రభుత్వం. జనవరి 21 నుంచి ఈ కొత్త మెనూ అమల్లోకి రాబోతుంది. సంక్రాంతి పండుగ తర్వాత ఈ మెనూ అమల్లోకి తీసుకుని రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసమే తేదీ కూడా నిర్ణయించింది.
మారిన మెనూ వివరాలు:
సోమవారం – అన్నం, పప్పుచారు, గుడ్డు కూర
మంగళవారం -పులిహోర, టమాటా, పప్పు, గుడ్డు
బుధవారం – వెజిటేబుల్ రైస్, ఆలుకూర, గుడ్డు
గురువారం – కిచిడీ, టమాటా చట్నీ, గుడ్డు
శుక్రవారం – అన్నం, ఆకుకూర పప్పు, గుడ్డుశనివారం – అన్నం సాంబర్ , పొంగలి
అలాగే మధ్యాహ్న భోజనం అమలు కోసం ఏజెన్సీలకు ఇచ్చే నిధులను కూడా పెంచింది ప్రభుత్వం. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రోజుకు ఇంతకుముందు రూ.4.23 ఇచ్చేవారు. ఇకపై రూ4.48 చెల్లిస్తారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులకు రూ.6.48 నుంచి రూ 6.71 పైసలకు పెంచారు. మార్కెట్లో నిత్యావసరాల సరుకులు ధరలు పెరిగిన క్రమంలో వంట ఏజెన్సీలకు గౌరవ వేతనాన్ని కూడా ప్రభుత్వం పెంచింది. మిడ్ డే మీల్స్ కోసం కుక్‌లు, అసిస్టెంట్ కుక్‌లు పనిచేస్తున్నారు. గతంలో వీరికి నెలకు రూ.వెయ్యి గౌరవ వేతనం చెల్లించేవారు. ఇప్పుడు వాటిని ప్రభుత్వం రూ.3 వేలకు పెంచింది. 2019 ఆగస్టు నెల నుంచి ఈ మొత్తం అమల్లోకి తీసుకుని వచ్చింది ప్రభుత్వం.