నేనున్నా : ఎమ్మెల్యే శ్రీదేవికి ధైర్యం చెప్పిన సీఎం జగన్

కులం పేరుతో దూషిస్తే.. ఎవరినీ ఉపేక్షించేది లేదని సీఎం జగన్ హెచ్చరించారు. హోంమంత్రి సుచరితతో కలిసి తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి..సెప్టెంబర్ 05వ తేదీ గురువారం సీఎం జగన్‌ను కలిశారు. వినాయకుడి విగ్రహం వద్ద తనకు జరిగిన అవమానాన్ని ఎమ్మెల్యే శ్రీదేవి వివరించారు. కులం పేరుతో దూషించడంతో పాటు.. టీడీపీ నేతలు అరాచకంగా ప్రవర్తించారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అవమాన భారంతో ఆవేదన చెందుతున్న శ్రీదేవికి సీఎం జగన్ ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో ఏ మహిళకూ ఇలాంటి అవమానకర పరిస్థితులు ఎదురుకాకూడదన్నారు. బడుగు బలహీన వర్గాలను కలుపుకుని ముందడుగు వేసే వాతావరణం ఉండాలన్న సీఎం జగన్..మహిళల గౌరవానికి భంగం కలిగితే కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి సుచరితను ఆదేశించారు.
వినాయక చవితి పండుగ సందర్బంగా..తుళ్లూరు మండలం అనంతవరంలో ఎమ్మెల్యే శ్రీదేవిపై టీడీపీ నేతలు దుర్భషలాడారు. కులం పేరిట అసభ్యపదజాలంతో ఆమెను దూషించారు. ఎమ్మెల్యే శ్రీదేవి గణేష్ చతుర్థి వేడుకల్లో పాల్గొంటే… వినాయకుడు మైలపడతాడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతల వ్యాఖ్యలతో మనస్తాపానికి లోనైన ఎమ్మెల్యే కంటతడి పెట్టారు. శ్రీదేవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ శ్రేణులను పోలీసులు అదుపు చేయడంతో ఎమ్మెల్యే శ్రీదేవి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Read More : చౌకబారు విమర్శలు : పవన్ వారి చేతిలో పావులా మారారు