నోటీస్ రెడీ : APS RTCలో సమ్మె కలకలం

ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో మళ్లీ సమ్మె కలకలం. డిమాండ్ల సాధన కోసం నోటీస్ ఇవ్వాలని నిర్ణయించింది ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ). ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున ప్రభుత్వానికి సమాచారం ఇవ్వనుంది. 2019, మే 9వ తేదీన నోటీస్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నోటీస్పై ఆర్టీసీ యూనియన్ల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఎంప్లాయీస్ యూనియన్ ఇచ్చే నోటీస్ తో సంబంధం లేదని అంటోంది నేషనల్ మజ్దూర్ యూనియన్ (NMU).సమ్మెకి ఉమ్మడిగి వెళ్దామని ఎవరూ అడగలేదని.. ఈయూ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని వెల్లడించారు ఎన్ఎంయూ నేతలు. దీంతో వారు కూడా విడిగా నోటీస్ ఇవ్వనున్నారు.
ఆర్టీసీలో పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఎండీకి నోటీసు ఇవ్వటానికి రెండు యూనియన్లు రెడీ అయిపోయాయి. అయితే విడివిడిగా ఇస్తున్నాయి. 25శాతం తాత్కాలిక ఫిట్ మెంట్ ఇవ్వాలని, మొదటి విడత కింద 40శాతం భత్యాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలోనే వీటికి సంబంధించి స్పష్టమైన హామీ వచ్చిందని.. అయితే ఇంత వరకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. వెంటనే ఈ రెండు డిమాండ్లు పరిష్కరించాలంటూ నోటీస్ ఇస్తున్నారు ఆర్టీసీ కార్మికులు.