తూర్పు గోదావరిలో ట్రైయాంగిల్ లవ్: అమ్మాయి కోసం చంపేశారు

తూర్పు గోదావరి జిల్లాలో ట్రైయాంగిల్ లవ్ కారణంగా ఓ వ్యక్తిని స్నేహితుడి సాయంతో చంపేశాడు ఓ ప్రేమికుడు. తుని సమీపంలోని తాండవ నదిలో గుర్తు తెలియని శవం దొరకగా.. ఎట్టకేలకు మిస్టరీని ఛేదించారు పోలీసులు. తాను ప్రేమించిన అమ్మాయిని ప్రేమించాడనే కక్షతోనే ఇద్దరు యువకులు తాండవ నదిలోకి తోసేశారని తుని రూరల్ సిఐ కిశోర్ బాబు వెల్లడించారు. ఈ మేరకు విచారణ జరిపిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. సీఐ కిశోర్ బాబు మీడియా ప్రతినిధులకు శనివారం వివరించారు. గత నెల 22వ తేదీన తుని మండలం డి. పోలవరం, నందిఒంపు ప్రాంతాల మధ్య తాండవ నదిలో గుర్తు తెలియని వ్యక్తి శవం లభించింది. మృతుడిని తుని పట్టణం రాజీవ్ గృహకల్పకు చెందిన గీసాల రాజుగా గుర్తించారు. మృతుడి బంధువు కాపారపు విజయసత్యమూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.
ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు రాజుకు స్నేహితుడైన మాకిరెడ్డి వెంకటేష్ ఓ అమ్మాయి విషయంలో వ్యక్తిగత కక్షలు కారణంగా మిత్రుడు సబ్బవరపు ప్రసాద్ సాయంతో రాజును వెంకటేష్ పుట్టిన రోజు పార్టీ అని చెప్పి కొలిమేరు గ్రామశివారులోని తాండవ నది ఒడ్డుకు తీసుకుని వెళ్లి అక్కడ ముగ్గురు మద్యం సేవించిన తర్వాత రాజుకు ఎక్కువగా మద్యం తాగించి నదిలోకి తోసేశారు.