ఆ దూకుడు, జోష్ ఏవి : పోలింగ్ తర్వాత పవన్ కల్యాణ్‌కి ఏమైంది

ఎన్నికల నోటిఫికేషన్ ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్…ఏపీలో హడావిడి చేశారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పార్టీ అభ్యర్థుల తరపున జోరుగా ప్రచారం నిర్వహించారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా…. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు తిరిగారు. జనసేనాని ప్రచారంలో చూపించిన జోష్…ఇప్పుడు ఏమైంది. అధికార, విపక్షాలు విజయంపై లెక్కలు వేసుకుంటుంటే… పవన్ మౌనం దాల్చడానికి కారణం ఏంటి..?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. పార్టీ పెట్టిన తర్వాత కొంత స్థబ్దుగా ఉన్న పవన్… ఎన్నికల నోటిఫికేషన్ ముందు రాష్ట్రం మొత్తం తిరిగారు. ఆ తర్వాత వామపక్షాలు, బీఎస్పీలతో కలిసి…కూటమిని ఏర్పాటు చేశారు. రాష్ట్రమంతటా అభ్యర్థులను నిలబెట్టి….తన సత్తాను చాటుకున్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు దూకుడు ప్రదర్శించారు. ఏ నియోజకవర్గంలో ప్రచారం చేసినా యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా స్పీచ్‌లు దంచారు. ఆవేశంతో ఊగిపోయారు. సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ చేసే విమర్శలను ఎప్పటికపుడు తిప్పికొట్టారు. అదే సమయంలో ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చారు. జనసేన పార్టీతోనే ఏపీలో మార్పు సాధ్యమంటూ…ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. చివరకు.. తానే సీఎంనంటూ ప్రకటించుకున్నారు.
పోలింగ్ ముగిసింది. ఓట్ల లెక్కింపునకు చాలా సమయముంది. ఇప్పటి దాకా ప్రచారంలో బిజీబిజీగా గడిపిన నేతలు… ప్రస్తుతం పోలింగ్ సరళిపై ఎవరికి వారే లెక్కలు వేసుకుంటున్నారు. ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ…విజయం తమదంటే తమదేనని ధీమాలో ఉన్నాయి. ఏ నియోజకవర్గంలో ఎంత శాతం పోలింగ్ నమోదైంది ? వృద్ధులు, వికలాంగులు, మహిళలు, రైతులు ఎవరికి వేశారని అంచనాలు వేసుకుంటున్నాయి. పలు నియోజకవర్గాల్లో ఊహించని రీతిలో పోలింగ్ శాతం పెరగడంతో…తమకే లాభిస్తుందని ఇరు పార్టీలు ధీమాలో ఉన్నాయి.
విజయంపై టీడీపీ, వైసీపీ హడావిడి చేస్తున్నా జనసేనలో మాత్రం ఎలాంటి ఉలుకూపలుకూ లేదు. పోలింగ్ వరకు ఉన్న జోష్…ఇప్పుడు లేదని పార్టీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు కింగ్ అవకపోయినా…కింగ్ మేకర్ అవుతామంటూ పవన్ ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం…అలా కనిపించడం లేదు. పోలింగ్ ముగిసిన తర్వాత జనసేన నేతలు, కార్యకర్తలు నిరుత్సాహంలో పడిపోయారు. ఏ జిల్లాలో జనసేన నేతలు, కార్యకర్తలను కదిపినా…పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఓటమి సంగతి అటుంచితే…ఇన్ని ఓట్లు వస్తాయని కూడా స్పష్టమైన సమాధానం రావడం లేదు. జనసేన పార్టీ నేతల్లో ప్రచారంలో ఉన్నంత దూకుడు…ఇప్పుడు లేదు. నేతల నుంచి కార్యకర్తల వరకు అందరూ సైలెంట్ అయిపోయారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నుంచి ఎన్నికల పోటీ చేసిన అభ్యర్థుల దాకా…పోలింగ్ సరళి చూసిన తర్వాత ఏం చెప్పలేకపోతున్నారు.