భార్యాభర్తల ప్రాణాల మీదకు తెచ్చిన ఫోటోషూట్.. ఎంత ఘోరం జరిగిపోయిందో చూడండి.. వీడియో వైరల్

ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Photo Shoot On Rail Bridge (Photo Credit : Google)

Photo Shoot Incident : ఈ మధ్య కాలంలో రీల్స్ పిచ్చితో పాటు ఫోటోషూట్ల పిచ్చి బాగా ముదిరిపోయింది. ఎక్కడపడితే అక్కడ రీల్స్, ఫోటోషూట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. చేతులారా చావును కొని తెచ్చుకుంటున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో ఇలాంటివి చేస్తూ అనేకమంది చనిపోయారు. చాలా మంది తీవ్ర గాయాలతో మంచాన పడ్డారు. ఇలాంటి వాటిని కళ్లారా చూస్తున్నా, చెవులతో వింటున్నా.. ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. పిచ్చి చేష్టలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఫోటోషూట్ మోజు భార్యాభర్తల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. చావు తప్పినా.. తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.

ఎంతో ప్రమాదకరమైన రైల్వే బ్రిడ్జిపై ఫొటోషూట్ ఆ భార్యాభర్తల ప్రాణాల మీదకు తెచ్చింది. రాజస్థాన్ రాష్ట్రం పాలి జిల్లాలని గోరంఘాట్ బ్రిడ్జిపై దంపతులు రాహుల్, జాన్వి ఫోటోషూట్ చేస్తున్నారు. ఇంతలో రైలు వచ్చేసింది. వారు ప్రాణ భయంతో 90 అడుగుల లోతులో ఉన్న లోయలోకి దూకేశారు. రైలు వేగం తక్కువగా ఉండటంతో లోకో పైలెట్ ట్రైన్ ను ఆపేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో భార్యకు కాలు విరిగింది. భర్త వెన్నుముకకు తీవ్ర గాయమైంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రాహుల్ మేవాడ(22), జాన్వి(20).. బాగ్డి నగర్ వాసులు. గోరంఘాట్ కు బైక్ పై వెళ్లారు. అక్కడ హెరిటేజ్ బ్రిడ్జిపై మీటర్ గేజ్ ట్రైన్ వెళ్లేందుకు ట్రాక్ వేసి ఉంది. దానిపై ఫోటోషూట్ చేస్తే థ్రిల్లింగ్ ఉంటుందని దంపతులు భావించారు. ఇద్దరూ కలిసి ఫోటోషూట్ లో మునిగిపోయారు. ఇంతలో ఊహించని విధంగా ఆ ట్రాక్ పైకి రైలు దూసుకొచ్చింది. దీంతో రాహుల్ దంపతులు బిత్తరపోయారు. ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. రైలు ఎక్కడ తమను గుద్దేస్తుందోనని భయపడిపోయారు. ఆ వెంటనే 90 అడుగుల లోతు ఉన్న లోయలోకి ఇద్దరూ దూకేశారు. భార్యాభర్తలు ఇద్దరూ చేతులు పట్టుకుని ట్రాక్ పై నుంచి లోయలోకి దూకడం వీడియోలో ఉంది. కాగా, రాహుల్ తో పాటు అతడి సోదరి, ఆమె భర్త కూడా అక్కడే ఉన్నారు. వారు కూడా ఫోటోషూట్ లో ఉన్నారు. అయితే లక్కీగా వారు ట్రైన్ రావడం గమనించి అక్కడి నుంచి పారిపోయారు. అలా తమ ప్రాణాలను కాపాడుకున్నారు.

కాగా, బ్రిడ్జిపై ఉన్న జంటను గుర్తించిన రైలు లోకో పైలట్ బ్రేక్ వేయడం ప్రారంభించాడు. దాంతో బ్రిడ్జిపై రైలు ఆగిపోయింది. అయితే, తీవ్ర భయాందోళనకు గురైన దంపతులు.. వారిని బ్రిడ్జి పైనుంచి దూకేలా చేసింది. ఫలితంగా వారికి తీవ్ర గాయాలయ్యాయి. బ్రిడ్జిపై అలానే ఉండి ఉంటే వారిద్దరు క్షేమంగా ఉండేవారని, ఎలాంటి ప్రమాదం జరిగి ఉండేది కాదని అధికారులు తెలిపారు. ఏది ఏమైనా ప్రమాదకర ప్రాంతాల్లో ఇలాంటి పనులు కరెక్ట్ కాదంటున్నారు.

Also Read : బుల్లెట్ దూసుకువస్తుండగా.. పక్కకు తల తిప్పిన ట్రంప్.. వీడియో వైరల్!

 

ట్రెండింగ్ వార్తలు