కరోనా రోగినంటూ ప్రాంక్ వీడియో.. యువకుడు అరెస్ట్

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఇప్పటివరకు ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనుక్కోలేకపోయారు. దీంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో కొందరు దీన్ని అవకాశంగా చేసుకుని ఫేక్ వార్తలు, వీడియోలను జనాల్లోకి వదులుతున్నారు. ఇదిగో ఈ యువకుడు కూడా అలాగే ప్రాంక్ వీడియో చేస్తూ.. అడ్డంగా బుక్కయ్యాడు.
అమెరికాకు చెందిన టైరల్ వ్యాలెస్ అనే యువకుడు ఓ మాల్ కు వెళ్లాడు. ముక్కుకు మాస్క్ పెట్టుకుని, తన టీషర్టు వెనుక “నాకు కరోనా వైరస్ ఉంది” అని పేపర పైన రాసి అంటించుకున్నాడు. మాల్ లో తిరుగుతూ నేలను శుభ్రం చేయడానికి ఉపయోగించే లైజాల్ స్ప్రే చేస్తూ నడిచాడు. అతడిని అలా చూడగానే మాల్‌లో ఉన్న కస్టమర్లు అంతా భయంతో వనికిపోయారు. వెంటనే అంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాల్ కు చేరుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. మాల్ లోని ప్రజలను భయాందోళనలకు గురిచేయడం వంటి కేసులు నమోదు చేశారు.
ఈ ఘటనపై పోలీస్ అధికారి క్రిస్ బాట్జామ్ మాట్లాడుతూ.. అతడు ప్రాంక్ చేయాలని అనుకోవడంలో తప్పులేదు. కానీ, ప్రజలను భయపెడుతున్న కరోనా వైరస్ పేరుతో ఆడుకోవడం తప్పు అని తెలిపారు. ఇప్పటికే ఓ జంటలో కరోనా వైరస్‌ను గుర్తించారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కరోనా వైరస్‌పై అప్రమత్తమైంది. ఇలాంటి సమయంలో అక్కడి యువత ఇలాంటి ప్రాంక్‌లను చేయడాన్ని సీరియస్‌గా తీసుకుంటోంది.