Hyderabad Rains: హైదరాబాద్‌కు చల్లని కబురు.. మరో రెండు రోజులు వానలు

గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయంది.

Rains

Hyderabad Rains: మండు టెండలతో, తీవ్రమైన ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. హైదరాబాద్ నగరానికి వాతావరణ శాఖ వర్ష సూచన ఇచ్చింది. నగరంలో మరో రెండు రోజులు వానలు కురిసే అవకాశం ఉందంది. ఈ నెల 19, 20వ తేదీలలో హైదరాబాద్ లో వాన పడే అవకాశం ఉందంది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడొచ్చంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయంది.

కాగా.. శుక్రవారం హైదరాబాద్ నగరంలో వాన దంచికొట్టింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రహదారులు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వాన రావడంతో ట్రాఫిక్ జామ్‌ కారణంగా వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈదురు గాలులతో కూడిన వాన పడటంతో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Also Read: సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ ఘటనలో మరో ట్విస్ట్.. పోలీసుల తీరుపట్ల బాధితురాలి ఆవేదన

శుక్రవారం హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. నగరవ్యాప్తంగా జడివాన జడిపించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వాన విరుచుకుపడింది. బలమైన గాలులతో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. నగర వ్యాప్తంగా దాదాపు 21 చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. భారీ వృక్షాలు విరిగిపడటంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది కూలిన చెట్లను తొలగించే పనులు చేపట్టాయి.

ఇక మధ్యాహ్నం వరకు ఎండ బెంబేలెత్తించింది. సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశాన్ని నల్లని మబ్బులు కమ్మేశాయి. 5 గంటలకే చీకట్లు కమ్ముకున్నాయి. మెల్లిగా మొదలైన వాన కాస్త మోస్తరు నుంచి జడివానగా మారింది. ఒక్కసారిగా వాన కురవడం, భారీగా ఈదురుగాలులు వీయడంతో జనం వణికిపోయారు. గాలి దుమారం నగరవాసులను భయపెట్టింది. అటు జడి వాన, ఇటు బలమైన గాలులు.. నగరవాసులను బెంబేలెత్తించాయి. ఆఫీసులు, పనులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో వాన కురవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

 

అటు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రెండు రోజులు వానలు కురవచ్చంది. ఈ నెల 19, 20వ తేదీలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 19వ తేదీన ములుగు, భద్రాద్రి కొత్తగూడెం,
ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, నాగర్ కర్నూలు, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయంది.

ఇక 20వ తేదీన రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందంది వాతావరణ శాఖ. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్, వనపర్తి నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వాన పడే అవకాశం ఉందంది.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here