Cyclone Fengal Fear (Photo Credit : Google)
Cyclone Fengal : నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం గంటకు 2 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. మరో 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుంది. రేపు ఉదయంలోగా తుపానుగా మారొచ్చని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వాయుగుండం ట్రింకోమాలికి 110 కిలోమీటర్లు, నాగపట్టణానికి 310 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 410 కిలోమీటర్లు, చెన్నైకి 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ నెల 30న కారైకాల్, మహాబలిపురం మధ్య వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇప్పటికే తుపానుకు ఫెంగల్ గా నామకరణం చేశారు. ఈ ఫెంగల్ తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. చాలా చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడతాయంది. తీరం వెంబడి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో అన్ని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు.. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
తమిళనాడు, పుదుచ్చెరిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు వానలు పడతాయంది. అటు కేరళలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వానలు, పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరం వెంబడి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందంది.
పంటలు చేతికొచ్చే సమయం కావడంతో రైతులను సైతం అప్రమత్తం చేసింది ఐఎండీ. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున పంట పొలాలను భద్రపరుచుకోవాలని సూచించింది. గాలుల వేగం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది. తుపాను తీరం దాటే సమయంలో ఎక్కువగా వర్షపాతం నమోదవడం, గాలుల వేగం అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.
Also Read : కస్టోడియల్ టార్చర్ కేసు.. అప్పటి సీఐడీ చీఫ్‌కు చిక్కులు తప్పవా? ఆ పెద్ద నేతే టార్గెట్టా?