Flash Floods: కోస్తాంధ్రకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు..! ఈ జిల్లాలకు వాన గండం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం..

వచ్చే 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో మెరుపు వరదలు సంభవిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. (Flash Floods)

Flash Floods: కోస్తాంధ్ర తీర ప్రాంతాలకు వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. కోస్తా, ఉభయ గోదావరి జిల్లాలకు వాన గండం పొంచి ఉన్నట్లు తెలిపింది. బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనంతో మధ్య కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కుండపోత వానలు పడే అవకాశం ఉందని.. కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. కృష్ణా, గోదావరి నదులకు వరద నీరు పోటెత్తే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని హెచ్చరించింది.

ఏపీలోని పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు జారీ అయ్యాయి. వచ్చే 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో మెరుపు వరదలు సంభవిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.

ఆకస్మిక వరదలకు అవకాశం..

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. అనుకున్న దానికంటే ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వానలు పడుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏలూరు జిల్లా తణుకులో 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాగల 24 గంటల్లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు యానంలో
ఆకస్మిక వరదలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఒక్కసారిగా ఎక్కువ మోతాదులో వర్షం కురవడం, కురిసిన వానల కారణంగా వరద నీరు ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఉందన్నారు. అంతేకాకుండా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశం ఉందని, సముద్రం అంతా అల్లకల్లోలంగా మారిందని, కాబట్టి తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర కోస్తాంధ్రలోని అన్ని పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

Also Read: జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్ బీభత్సం.. 33మంది భక్తులు మృతి.. ఆలయానికి వెళ్లే సమయంలో ఘోరం