Site icon 10TV Telugu

Hyderabad Rain: హైదరాబాద్‌లో కుంభవృష్టి.. మలక్ పేట్ బ్రిడ్జి కింద భారీగా చేరుకున్న వరద నీరు..

Hyderabad Rain: భారీ వర్షం హైదరాబాద్ నగరాన్ని హడలెత్తించింది. కుండపోత వానతో నగరం చిగురుటాకులా వణికింది. నాన్ స్టాప్ గా కురిసిన వర్షంతో నగరవాసులు బెంబేలెత్తిపోయారు. భారీ వర్షంతో నగరం అతలాకుతలమైంది. రోడ్లు వాగులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మలక్ పేట్ బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరుకుంది. దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, చాదర్ ఘాట్, కోఠీ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఇటీవల నిర్మించిన రైల్వే అండర్ పాస్ తో పాటు పక్కన ఉన్న రైల్వే ట్రాక్ బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరింది. అటు మూసీకి వరద నీరు పోటెత్తింది.

హయత్ నగర్ సర్కిల్ పరిధిలో 6 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్ నగర్, ఎల్బీనగర్, గోశామహల్, బేగంపేట్ సర్కిళ్ల పరిధిలో 2 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయ్యింది. నగరంలోని రోడ్లు వాగులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని గంటల పాటు ఇలాగే వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు.

Exit mobile version