Hyderabad Rains: హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. చెరువుల్లా మారిన వీధులు.. 2 గంటల్లో భారీగా వర్షపాతం నమోదు..

బాలానగర్ లో సాయంత్రం 5 గంటల వరకు అత్యధికంగా 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Hyderabad Rains: హైదరాబాద్ నగరంలో వర్షం దంచికొట్టింది. శుక్రవారం సాయంత్రం నగర వ్యాప్తంగా కుండపోత వాన కురిసింది. రెండు గంటల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో జనం ఇబ్బందులు పడ్డారు. రోడ్లపైకి భారీగా చేరిన వర్షం నీటితో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాతావరణ కేంద్రం హెచ్చరికలతో నిన్ననే జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటు హైడ్రా టీమ్ కూడా అలర్ట్ అయ్యింది.

హైదరాబాద్ నగరం మొత్తం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. శుక్రవారం సాయంత్రం వాన దంచికొట్టింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వాన పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ, హైడ్రా టీమ్స్ రంగంలోకి దిగాయి. రోడ్లపై నిలిచిన వర్షపు నీరు వెళ్లిపోయేలా చర్యలు తీసుకున్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో గడిచిన 2 గంటల్లో భారీగా వర్షపాతం నమోదైంది. బాలానగర్ లో సాయంత్రం 5 గంటల వరకు అత్యధికంగా 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బండ్లగూడ మారేడుపల్లిలో 9.1 సెంటీమీటర్లు, చాంద్రాయణగుట్టలో 8.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉప్పల్, నాచారం, మూసారాంబాగ్ లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Also Read: రెయిన్ అలర్ట్.. ఏపీలోని ఆ జిల్లాల్లో ఇవాళ, రేపు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచనలు

సైదాబాద్, చార్మినార్, మల్కాజ్ గిరి, లాలాపేట్, మాదాపూర్, శేరిలింగంపల్లిలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంబర్ పేట, కూకట్ పల్లి, సరూర్ నగర్, రాజేంద్రనగర్, శివరాంపల్లిలో 6.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చంపాపేట్, మియాపూర్, జీడిమెట్ల, ఉస్మానియా యూనివర్సిటీ, ముషీరాబాద్, కుత్బుల్లాపూర్, అల్వాల్ ప్రాంతాలలో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.