భానుడి భగభగలు: కర్నూలు, నందిగామ@39.7 డిగ్రీలు

  • Publish Date - February 24, 2019 / 03:50 AM IST

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఫిబ్రవరిలోనే వేసవి ప్రతాపం మొదలైంది. ఓవైపు ఎండవేడి, మరోవైపు ఉక్కపోతలు.. జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫిబ్రవరి నెలాఖరుకల్లా శీతాకాలం సీజన్‌ ముగిసి వేసవి ప్రారంభం కావాలి. కానీ అప్పుడే సమ్మర్ వచ్చేసిందా అనే అనుమానం కలుగుతోంది.

ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా జంప్ అయ్యాయి. అనూహ్యంగా సాధారణంకన్నా 4 డిగ్రీల వరకు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శనివారం(ఫిబ్రవరి 23 2019) తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా కర్నూలులో 39.7, నందిగామలో 39.1, భద్రాచలంలో 38.5, మహబూబ్‌నగర్‌లో 38.2, హైదరాబాద్‌లో 36.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంకన్నా ఇవి 4 డిగ్రీలు అదనం. చల్లగా ఉండాల్సిన తిరుపతిలో ఏకంగా 38.9 డిగ్రీలుంది. ఇది సాధారణంకన్నా 4.8 డిగ్రీలు ఎక్కువ. ఏపీ, తెలంగాణలో సాధారణంకన్నా ఇంత ఎక్కువ ఉన్న ప్రాంతం ఇదేనని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వింటర్ నుంచి సమ్మర్‌లోకి ప్రవేశించే సమయంలో ఇలాంటి వాతావరణ మార్పులు సహజమేనని అన్నారు.

నందిగామలో శనివారం(ఫిబ్రవరి 23) 39.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నందిగామ చరిత్రలో పదేళ్ల కాలంలో ఫిబ్రవరిలో అత్యధిక ఉష్ణోగ్రత 2009 ఫిబ్రవరి 25న 39 డిగ్రీలుగా రికార్డుల్లో ఉంది. ఇప్పుడు అది చెరిగిపోయింది. కర్నూలులోనూ ఇదే పరిస్థితి. పదేళ్ల కాలంలో ఫిబ్రవరిలో అత్యధిక రికార్డు 2009 ఫిబ్రవరి 26న 39.9 డిగ్రీలుగా ఉంది. ఇప్పుడు దానికి చేరువగా 39.7డిగ్రీలకు చేరింది. ఆదిలాబాద్‌ టౌన్‌లో 2017 ఫిబ్రవరి 22న 37.8 డిగ్రీలుగా ఉంది. ఇప్పుడు దానికి చేరువగా 37.3 డిగ్రీలు నమోదైంది. ఈ పట్టణంలో నెల రోజుల్లో ఏకంగా 10 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

15రోజుల క్రితంతో పోలిస్తే పలు ప్రాంతాల్లో సాధారణంకన్నా ఏకంగా 8డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సీజన్‌ మారే సమయంలో ఏర్పడే ఇలాంటి వాతావరణం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తడం సాధారణమన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని,  దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు లేదా ఒక మాదిరి వర్షాలు పడే సూచనలున్నట్లు వివరించారు. మిగతా ప్రాంతాల్లో ఎండ వేడి పెరగనుందని చెప్పారు. ఆదివారం(ఫిబ్రవరి 24) నుంచి 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వడదెబ్బ బారిన పడకుండా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు