Monsoons : తెలుగు రాష్ట్రాలను పలకరించిన నైరుతి రుతుపవనాలు

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన నైరుతి రుతుపవనాలు నిన్న ఉభయ తెలుగు రాష్ట్రాలలోకి ప్రవేశించాయు.

Monsoons

Monsoons :  ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన నైరుతి రుతుపవనాలు నిన్న ఉభయ తెలుగు రాష్ట్రాలలోకి ప్రవేశించాయు. తెలంగాణ లోని మహబూబ్ నగర్ జిల్లా, ఆంధ్రాలోని రాయలసీమ జిల్లాలను నిన్న తాకాయి. ఒకటి రెండు రోజుల్లో ఇవి రాష్ట్రమంతటా విస్తరించనున్నాయి. రుతుపవనాల రాక ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో వాతావరణం చల్ల బడింది. హైదరాబాద్ లో నిన్నరాత్రి పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

నైరుతి రుతుపవనాల గాలలుతో శుక్రవారం వరకు ఆంధ్రాలోని కోస్తా, రాయలసీమలోని కొన్ని జిల్లాలలలో ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వివరించారు. బుధవారం నాటికి తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని ప్రాంతాలలో ముందుకు సాగేందుకు అనుకూల పరిస్ధితులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణలోని మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో సోమవారం సాయంత్రం తొలకరి వర్షాలు కురిసినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ కె.నాగరత్న తెలిపారు. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాలకు, తర్వాత రెండ్రోజుల్లో దాదాపు రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరిస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ వానాకాలం సీజన్‌లో వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా కురుస్తాయని అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రాలు ప్రకటించాయి.

జూన్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని, జూలై, ఆగస్టు, సెప్టెంబరుల్లో సాధారణం కంటే అధికంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. రుతుపవనాలు చురుగ్గా లేకపోవటం వల్ల జూన్ లో సాధారణ వర్షపాతం నమోదైనా…జూలై, ఆగస్టు, సెప్టెంబరుల్లో రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి నాగరత్న చెప్పారు.

రుతుపవనాల ప్రభావంతో నిన్న రాత్రి తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసరలో 91.5 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదు కాగా..కాప్రా లో 89.8, కామారెడ్డి లో 83, ఖమ్మం లో 76.5 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదు అయ్యిందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు వివరించారు.

Also Read : Hyderabad Rains: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం, స్తంభించిన విద్యుత్ సరఫరా