Weather Updates: ఏపీకి రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వానలు.. పిడుగులు పడే ప్రమాదం..

ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

  • Published On : March 24, 2026 / 10:58 PM IST

 

Weather Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వానలు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో వానలు కురిశాయి. ఎండా కాలంలో అకాల వర్షాలతో వాతావరణం కాస్త కూల్ అవుతోంది. దీంతో జనాలు ఎండ తీవ్రత నుంచి కాస్త రిలీఫ్ పొందుతున్నారు. మరోసారి రాష్ట్రానికి వర్ష సూచన చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పిడుగులు పడొచ్చని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గరిష్టంగా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చంది. అదే సమయంలో రాబోయే 5 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని అంచనా వేసింది.

కాగా పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం పడే సమయంలో చెట్ల కింద, పంట పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని హెచ్చరించారు. సురక్షితమైన ప్రాంతాల్లోనే తలదాచుకోవాలని జాగ్రత్తలు చెప్పారు.